ఐటీ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఎఫెక్ట్

by Malleboina Mahesh |

హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో నేడు సీఎం రేవంత్ రెడ్డి 'రైతు భరోసా' సభ.. మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 వరకు మాదాపూర్ పరిసరాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు!

ఐటీ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఎఫెక్ట్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల వాహనదారులకు, ఐటీ ఉద్యోగులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో జరగాల్సిన ప్రతిష్టాత్మక 'రైతు భరోసా' నిధుల విడుదల కార్యక్రమం భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికకు బదిలీ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,000 మంది ప్రతినిధులు, రైతులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సాగనున్నప్పటికీ, వీఐపీల రాకపోకలు, జనాల రద్దీ దృష్ట్యా మధ్యాహ్నం 3 గంటల నుంచే మాదాపూర్ పరిధిలోని ప్రధాన రహదారులపై వాహన రద్దీ విపరీతంగా పెరిగి భారీ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.

ట్రాఫిక్ జామ్‌లలో ఇరుక్కోకుండా ఉండేందుకు వాహనదారులు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, ఐకియా జంక్షన్, ట్రైడెంట్ హోటల్ పరిసరాలు, శిల్పకళా వేదిక, శిల్పారామం, మెటల్ చార్మినార్ జంక్షన్ మార్గాల వైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఆఫీసుల నుండి ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యే ఐటీ ఉద్యోగులు ఈ ట్రాఫిక్ ఆంక్షలను గమనించాలని కోరారు. ప్రయాణ సమయాల్లో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గూగుల్ మ్యాప్స్ సహాయంతో తక్కువ రద్దీ గల ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని, ట్రాఫిక్ పోలీసుల నిబంధనలకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Next Story