- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ ద్రోహాన్ని మరిచిపోతారని అనుకోవడం అవివేకమే.. రైతుభరోసా నిధుల విడుదల వేళ కేటీఆర్ విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల్లో రూ.30 వేల కోట్ల రైతు భరోసా నిధులు ఎగ్గొట్టి మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు పెద్ద ఎత్తున రైతుభరోసా నిధులు బాకీ పడిందని గడిచిన 30 నెలల పాలనలో దాదాపు రూ.30 వేల కోట్ల రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిందే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడటానికి ఏమాత్రం సిగ్గనిపిస్తలేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతులకు బకాయి పడిన రైతు భరోసా నిధులు, కాంగ్రెస్ ప్రభుత్వ ఎగవేతలపై ఇవాళ ఆయన స్పందించారు. గత రెండున్నరేళ్లలో ఎగ్గొట్టిందే ఎక్కువ అని 70 లక్షల మంది రైతులు శాపనార్థాలు పెడుతుంటే.. ఆశీర్వాద సభల పేరిట డ్రామాలా అని నిలదీశారు.
శాపంలా వెంటాడటం ఖాయం
కేవలం ఒక్క బటన్ నొక్కి వేయాల్సిన రైతుభరోసాకు కూడా బహిరంగ సభ పెట్టే రేవంత్ రెడ్డి పీఆర్ స్టంట్లు చూసి రైతులు అసహ్యించుకుంటున్నారన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టిన మీ ద్రోహాన్ని రైతులు మరిచిపోతారని అనుకోవడం మీ అవివేకమే అవుతుందన్నారు. ప్రతి ఎకరానికి ఏడాదికి 15 వేలు ఇస్తానని గ్యారెంటీల గారడీచేసి, చివరికి ఉన్నది ఊడగొట్టే దుస్థితి తెచ్చినందుకు ముందు ముక్కునేలకు రాయాలన్నారు. అరకొరగా ఒకటి, రెండు ఎకరాలకు వేసినట్టు చేసి చేతులు దులుపుకుంటున్న మీ పాపం మిమ్మల్ని నిరంతరం శాపంలా వెంటాడటం ఖాయం అని హెచ్చరించారు.
అటెన్షన్ డైవర్షన్ చేసే ఈ దిక్కుమాలిన చర్యలు
ఇప్పటికే 50 వేల కోట్లతో చేయాల్సిన రెండులక్షల రుణమాఫీని, చారాణా కూడా చేయకుండా అధికారంలోకి రాగానే అన్నదాత గొంతుకోశారని, 72 సార్లు సీఎం ఢిల్లీ టూర్లకు, పనికిరాని ఈ పబ్లిక్ మీటింగ్‍లకు పెడుతున్న కోట్ల రూపాయల ఖర్చును ఆదాచేసి ఉంటే రైతులకు పెట్టుబడి సాయం దక్కేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యూరియా దొరకక అల్లాడుతున్న అన్నదాతల కష్టాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసే ఈ దిక్కుమాలిన చర్యలు ఏమాత్రం పనిచేయవని గుర్తుపెట్టుకోవాలన్నారు. కేంద్రం ఎంత కొంటే అంతే కొంటామని పంట కొనుగోళ్ల బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకున్న మీ చేతకానితనాన్ని చూసి అన్నదాతలు పట్టలేని కోపంతో రగిలిపోతున్నారన్నారు. కేసీఆర్ టంచన్ గా 11 సార్లు, 73 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాలో వేసి రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికారని, పదేళ్లు పండగలా సాగిన వ్యవసాయాన్ని దండగలా మార్చి, రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న మీ దుర్మార్గాన్ని అన్నదాతలు ఎన్నటికీ క్షమించే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రైతు బాంధవుడిగా కేసీఆర్ నిలిచి ఉంటే.. రేవంత్ రెడ్డి ఎప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలి ఉంటారని ఇది గుర్తుపెట్టుకోవాలన్నారు.






