తెలంగాణ రైతులు హ్యాపీ.. ఇకనుంచి మరింత సులభం..

by Gantepaka Srikanth |

తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 'రైతు నేస్తం' కార్యక్రమంలో పాల్గొని రైతులతో ముఖాముఖి ముచ్చటించారు.

తెలంగాణ రైతులు హ్యాపీ.. ఇకనుంచి మరింత సులభం..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) 'రైతు నేస్తం' కార్యక్రమంలో పాల్గొని రైతులతో ముఖాముఖి ముచ్చటించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు తమ వ్యవసాయ అనుభవాలు, ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ పథకాల వల్ల పొందుతున్న ప్రయోజనాలను మంత్రితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యూరియా యాప్ అమలుపై మంత్రి స్వయంగా రైతులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. యాప్ ద్వారా ఎరువుల సరఫరా పారదర్శకంగా, సులభంగా జరుగుతుండటంపై రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా యూరియా లభ్యత, సమయానికి సరఫరా వంటి అంశాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని వారు తెలిపారు.

రైతులు చూసేలా ప్రదర్శనలు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి మంగళవారం నిర్వహించే 'రైతు నేస్తం' కార్యక్రమంలో రైతుల అవసరాల మేరకు అంశాలను ముందుగానే నిర్ణయించాలని అధికారులకు సూచించారు. నిర్ణయించిన అంశాలకు అనుగుణంగా రైతుల అనుభవాలు, విజయగాథలను క్షేత్రస్థాయిలో – పొలాల నుంచే ప్రత్యక్షంగా, ఇతర రైతులు చూసేలా ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇఫ్కో కంపెనీ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ కృపా శంకర్.. నానో యూరియా వినియోగం, దాని ప్రయోజనాలు, సరైన వాడక విధానంపై రైతులకు సమగ్రంగా వివరించారు. పీజేటీఎస్ఏయూ (PJTSAU) నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ కిరణ్ బాబు, డాక్టర్ అరుణశ్రీ యాసంగి వరిలో వచ్చే పురుగులు, తెగుళ్లు మరియు వాటి సమర్థవంతమైన యాజమాన్యంపై రైతులకు శాస్త్రీయంగా వివరించారు.


'రైతు నేస్తం' కార్యక్రమం సమర్థవంతంగా కొనసాగుతున్న తీరును, రైతులకు చేరువయ్యేలా అధికారులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని మంత్రి ప్రశంసించారు. అదే సమయంలో రైతుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎక్కువ సంఖ్యలో రైతులు పాల్గొనేలా ముందస్తు ప్రచారం, సమన్వయం చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story