రోడ్డు ప్రమాదంలో గాయపడిన ‘ట్రస్మా’ జోనల్ అధ్యక్షుడు హరికుమార్ మృతి

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-08 04:44:04  IST  )

పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, విశ్వజెనిత్ స్కూల్ కరస్పాండెంట్, వర్ధన్నపేట జోన్ ‘ట్రస్మా’(TRSMA) అధ్యక్షుడు ఎర్రబెల్లి హరికుమార్(45) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ‘ట్రస్మా’ జోనల్ అధ్యక్షుడు హరికుమార్ మృతి
X

దిశ, పర్వతగిరి: పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, విశ్వజెనిత్ స్కూల్ కరస్పాండెంట్, వర్ధన్నపేట జోన్ ‘ట్రస్మా’(TRSMA) అధ్యక్షుడు ఎర్రబెల్లి హరికుమార్(45) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మరణంతో పర్వతగిరి మండలంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితం హరికుమార్ తన భార్య శ్వేతతో కలిసి పర్వతగిరి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు.

ఈ క్రమంలో సంగెం మండలం ఆశాలపల్లి గ్రామ పరిధిలోని రేణుక ఎల్లమ్మ గుడి సమీపానికి రాగానే, రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగి వారి బైక్‌పై పడింది. ఈ ప్రమాదంలో హరికుమార్‌కు తల, శరీర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆయన్ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంగళవారం ఉదయం హనుమకొండలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మృతునికి భార్య శ్వేత, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

నేడు ప్రైవేటు పాఠశాలల బంద్..

వర్ధన్నపేట నియోజకవర్గ ట్రస్మా ప్రెసిడెంట్ ఎర్రబెల్లి హరికుమార్ ఆకస్మిక మరణానికి సంతాపంగా నేడు జోన్ పరిధిలోని అన్ని ప్రైవేటు పాఠశాలలకు బంద్ ప్రకటిస్తున్నట్లు వర్ధన్నపేట జోన్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అందరూ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని, హరికుమార్ గారికి నివాళులు అర్పించాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. హరికుమార్ మృతి పట్ల పలువురు విద్యాసంస్థల అధినేతలు, ప్రెస్ క్లబ్ పర్వతగిరి,రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Next Story