- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్యా-ఉక్రెయిన్, ఇరాన్‌లపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ అణు వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine war), ఇరాన్ అణు వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. వైట్ హౌస్ (White House)లో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఈ రెండు ప్రధాన సమస్యలపై సానుకూల చర్చలు జరుగుతున్నట్లు మీడియాకు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చలు చాలా బాగున్నాయని, త్వరలోనే ఏదో ఒక పరిష్కారం జరగబోతోందని ట్రంప్ సంకేతాలిచ్చారు. కాగా ఏళ్ల తరబడి సాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలికేలా ట్రంప్ ప్రభుత్వం దౌత్యపరమైన పావులు కదుపుతున్నట్లు ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
మరోవైపు ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలపైనా ట్రంప్ స్పష్టత ఇచ్చారు. ఇరాన్ (Iran) ప్రస్తుతం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలని బలంగా కోరుకుంటోందని, చర్చలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. అయితే, ఈసారి ఒప్పందం గతంలో కంటే భిన్నంగా ఉంటుందని, ముఖ్యంగా ఇరాన్ వద్ద 'అణ్వాయుధాలు ఉండకూడదనేది' తమ ప్రధాన షరతు అని ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడో జరగాల్సిన ఈ ఒప్పందం, వారి విముఖత వల్ల ఆలస్యమైందని, ఇప్పుడు వారు చర్చలకు సిద్ధంగా ఉన్నారని ట్రంప్ వివరించారు.
ఇదే సమయంలో దౌత్యంతో పాటు సైనిక బలాన్ని కూడా ట్రంప్ ప్రదర్శిస్తున్నారు. అమెరికాకు చెందిన భారీ నౌకాదళం (Massive Fleet) ఇప్పటికే ఇరాన్ దిశగా ప్రయాణిస్తోందని, త్వరలోనే అది అక్కడికి చేరుకుంటుందని ఆయన హెచ్చరించారు. "ఒప్పందం కుదుర్చుకోవడానికి వారికి తగిన సమయం ఉంది. కానీ సరైన స్థానంలో ఉండటం ముఖ్యం" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకవేళ చర్చలు విఫలమైతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయనే హెచ్చరికను పరోక్షంగా ఇస్తూనే, శాంతియుత పరిష్కారం కోసం అమెరికా ద్వారాలు తెరిచి ఉన్నాయని ట్రంప్ ప్రకటించారు.






