వలసలపై ట్రంప్ విద్వేషం.. భారత్‌ను 'నరకం'తో పోల్చిన అమెరికా అధ్యక్షుడు

by Malleboina Mahesh |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను నరకంతో పోల్చడమే కాకుండా, టెక్ రంగంలో భారతీయుల ఆధిపత్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

వలసలపై ట్రంప్ విద్వేషం.. భారత్‌ను నరకంతో పోల్చిన అమెరికా అధ్యక్షుడు
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్ పై మరోసారి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేశారు. వలసల విధానం (Immigration policy)పై ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. భారత్‌ను 'నరకం'తో పోల్చాడు. తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో ప్రముఖ రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్‌కు చెందిన ఒక వివాదాస్పద వీడియోను రీ-షేర్ చేశారు. ఈ వీడియోలో భారత్, చైనా వంటి దేశాలను 'నరకం' (Hellhole) అని సంబోధించడమే కాకుండా, భారతీయ వలసదారుల పట్ల తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.

అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ద్వారా లభించే 'బర్త్‌రైట్ సిటిజన్‌షిప్' (పుట్టుకతో వచ్చే పౌరసత్వం) గురించి ప్రస్తావిస్తూ.. విదేశీయులు గర్భవతులుగా ఉన్నప్పుడు అమెరికాకు వచ్చి పిల్లలకు జన్మనిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ పిల్లలకు పౌరసత్వం వచ్చిన తర్వాత, వారు తమ కుటుంబం మొత్తాన్ని "చైనా, భారత్, మరేదైనా నరకం (Hellhole) నుంచి" అమెరికాకు తీసుకొస్తున్నారని ట్రంప్ షేర్ చేసిన వీడియోలో పేర్కొన్నారు. దీనిని 'చైన్ మైగ్రేషన్' (Chain Migration) గా అభివర్ణిస్తూ ఆయన విమర్శలు గుప్పించారు.

టెక్ రంగంలో భారతీయుల ఆధిపత్యం

కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ టెక్ కంపెనీల్లో భారతీయులు, చైనీయులు అధికంగా ఉండటంపై కూడా ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. "ఒకప్పుడు నేను భారతీయులకు పెద్ద మద్దతుదారుడిని, కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూశాక నా కళ్లు తెరుచుకున్నాయి. టెక్ కంపెనీల్లో వైట్ అమెరికన్లకు ఉద్యోగాలు దొరకడం లేదు. అక్కడ అంతా భారతీయులు, చైనీయుల నెట్‌వర్క్ నడుస్తోంది" అని ఆరోపించారు.

రాజ్యాంగ సవరణకు డిమాండ్..

అమెరికాలో పుట్టినంత మాత్రాన పౌరసత్వం ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలని ట్రంప్ మొదటి నుంచి వాదిస్తున్నారు. ఈ అంశంపై ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వలసదారులు అమెరికా పట్ల విధేయత చూపడం లేదని, ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడే వారే కరువవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై భారతీయ-అమెరికన్ సమాజం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ను నరకంతో పోల్చడం ట్రంప్ అజ్ఞానానికి నిదర్శనమని నెటిజన్లు మండిపడుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ టెక్ నిపుణులను కించపరచడం రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story