ఇరాన్ తన రిక్వెస్టును ఆలకించిందన్న ట్రంప్.. ఖండించిన ఇరాన్!

by Muthe.Rajitha |

ఇరాన్ జైళ్లలో ఉన్న ఎనిమిది మంది మహిళల ఉరిశిక్షల వ్యవహారంపై ట్రంప్, ఇరాన్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది.

ఇరాన్ తన రిక్వెస్టును ఆలకించిందన్న ట్రంప్.. ఖండించిన ఇరాన్!
X

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్ జైళ్లలో ఉన్న ఎనిమిది మంది మహిళల ఉరిశిక్షల వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ న్యాయవ్యవస్థ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. అయితే జనవరి 2026లో జరిగిన ఆందోళనల్లో అరెస్టు అయిన ఎనిమిది మంది మహిళలకు ఇరాన్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించనుందని ఒక ఆక్టివిస్ట్ చేసిన పోస్ట్‌ను ఏప్రిల్ 21న ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా షేర్ చేశారు. "ఆ మహిళలను వెంటనే విడుదల చేయండి, వారికి ఎటువంటి హాని చేయవద్దు" అని ఇరాన్ నాయకులను కోరారు. అయితే, ఇరాన్ జ్యుడీషియరీ ఈ ఆరోపణలను వెంటనే ఖండించింది. అసలు ఆ ఎనిమిది మంది మహిళల్లో ఎవరికీ ఉరిశిక్ష ఖరారు కాలేదని, ట్రంప్ అబద్ధపు వ్యాఖ్యలు చేస్తున్నారని ఇరాన్ స్పష్టం చేసింది. కొందరు మహిళలు ఇప్పటికే విడుదలయ్యారని, మిగిలిన వారు కేవలం జైలు శిక్షలు మాత్రమే అనుభవిస్తున్నారని వెల్లడించింది.

అయితే, ఈ వివాదం ఇక్కడితో ముగియలేదు. ఏప్రిల్ 22న ట్రంప్ మరో సంచలన పోస్ట్ చేస్తూ, తన అభ్యర్థనను గౌరవించి ఇరాన్ ఆ ఎనిమిది మంది ఉరిశిక్షలను రద్దు చేసిందని ప్రకటించారు. వారిలో నలుగురిని వెంటనే విడుదల చేస్తారని, మిగిలిన నలుగురికి కేవలం ఒక నెల జైలు శిక్ష విధిస్తారని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ రెండో పోస్టును కూడా ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా తోసిపుచ్చింది. తమ దేశ న్యాయ నిర్ణయాల్లో అమెరికా ప్రమేయం లేదని, అసలు ఉరిశిక్షలే లేనప్పుడు రద్దు చేయడం అనే ప్రశ్నే ఉదయించదని ఇరాన్ వర్గాలు ఘాటుగా స్పందించాయి. ప్రస్తుతం ఈ అంశంపై అంతర్జాతీయ స్థాయిలో గందరగోళం నెలకొంది. ట్రంప్ తన విదేశీ విధాన దౌత్యం వల్ల ఈ మార్పు జరిగిందని చెబుతుండగా, ఇరాన్ మాత్రం అది కేవలం ట్రంప్ కల్పిత ప్రచారమని కొట్టిపారేస్తోంది.

Next Story