- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ
తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

దిశ, సీతాఫల్‌మండి : తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ ఇన్‌చార్జి బండారి మహేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చిలకలగూడ గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీతాఫల్‌మండి చౌరస్తా నుంచి చిలకలగూడ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మహిళల హారతులు, పూల వర్షం మధ్య కవితకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సభలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ప్రజల ఆకాంక్షల నెరవేర్పు కోసమే జరిగిందని, అయితే ఇంకా అనేక వర్గాల ప్రజలు ఆశించిన ఫలితాలను పూర్తిస్థాయిలో అందుకోలేకపోయారని అన్నారు.
గత ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయని విమర్శించారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆమె, అధికారంలోకి వచ్చిన వెంటనే ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే ప్రతి కుటుంబానికి నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించే విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని, ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం కల్పించేందుకు కట్టుబడి ఉంటామని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సికింద్రాబాద్ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్న ఆమె, ప్రజా సమస్యల పరిష్కారంలో బండారి మహేందర్ ముదిరాజ్ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు ధరణి, యువ నాయకుడు సిద్ధార్థ్ బండారి, నాయకులు శ్రీకాంత్, ఫణీంద్ర, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా కృషి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన సికింద్రాబాద్‌లో నిర్వహించిన ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నామని పార్టీ నాయకులు పేర్కొన్నారు.






