విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి

by Taduka Kalyani |

విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.

విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
X

దిశ : నిజాంసాగర్ : విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బుధవారం ఎన్ఆర్ఐ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకుడు భుజంగారి భాస్కర్ రెడ్డి రూ.84 వేల విలువైన నూతన కంప్యూటర్‌ను విరాళంగా అందించారు. ఈ కంప్యూటర్‌ను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సాంకేతిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. అధ్యాపకులు విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు విలువలతో కూడిన బోధన అందించి, వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపించాలని సూచించారు.

విద్యార్థుల భవిష్యత్తుకు సాంకేతిక విద్యే బలమైన పునాది

అలాగే విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, పిల్లల చదువుపై నిరంతరం శ్రద్ధ వహించేలా చైతన్యం తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు కూడా ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయాలని అన్నారు. ఇదే సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న అధ్యాపకులు తమ ఉద్యోగ భద్రత, వేతనాలు తదితర సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ సమాజాభివృద్ధికి విద్యే ప్రధాన సాధనమని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు చేయూతనందించే దాతలు సమాజానికి ఆదర్శమని కొనియాడారు. భుజంగారి భాస్కర్ రెడ్డి తన స్వంత నిధులతో కంప్యూటర్‌ను అందించడం అభినందనీయమని అన్నారు. విద్యాభివృద్ధికి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని, ఆర్థికంగా స్థిరపడిన ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైనంత మేర ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు సహకరించాలని పిలుపునిచ్చారు.

సేవ చేయాలనే సంకల్పంతో

ఎన్ఆర్ఐ భుజంగారి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. తాను చదివిన నేలకూ, సమాజానికీ తిరిగి సేవ చేయాలనే సంకల్పంతో ఈ కంప్యూటర్‌ను అందించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండాలని, కంప్యూటర్ విద్య నేటి పోటీ ప్రపంచంలో ఎంతో అవసరమని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా విద్యారంగానికి తనవంతు సహకారం అందిస్తానని వెల్లడించారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపయోగపడే విలువైన కంప్యూటర్‌ను విరాళంగా అందించిన భుజంగారి భాస్కర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కంప్యూటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు యూనిస్ పటేల్, మండల అధ్యక్షుడు ప్రజా పండరి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సంకు లక్ష్మయ్య, కేతావత్ నారాయణ, వడ్ల బ్రహ్మం, నాయకులు గుర్రపు శ్రీనివాస్, బంగ్లా ప్రవీణ్ కుమార్, చాకలి సాయిలు, గైని దత్తు, మీనా సింగ్, నాగమయ్య,కళాశాల ప్రిన్సిపల్ అసద్ ఫరూక్ బహ్మది, ఇంచార్జ్ సంతోష్, ఫిజిక్స్ అధ్యాపకురాలు కవిత, కంప్యూటర్ ఆపరేటర్ పరుశురాం,అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story