బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఆఫీసుకు నిప్పు

by Muthe.Rajitha |

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చెలరేగాయి.

బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఆఫీసుకు నిప్పు
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఎన్నికల్లో BJP అఖండ విజయం సాధించిన తర్వాత, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ కార్యాలయాలే లక్ష్యంగా దాడులు, దహనకాండలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఆసన్‌సోల్‌లోని జమూరియా (రతిబాతి) ప్రాంతంలో ఉన్న టీఎంసీ కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టడం పెను సంచలనంగా మారింది. ఈ ఘటనలో కార్యాలయంలోని విలువైన దస్త్రాలు, పార్టీ జెండాలు, ఫర్నిచర్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

కేవలం జమూరియాలోనే కాకుండా బడ్జ్ బడ్జ్, సిలిగురి, బరాబని, ఫల్తా, బాలి, జగత్‌బల్లవ్‌పూర్ వంటి అనేక చోట్ల టీఎంసీ కార్యాలయాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు నమోదయ్యాయి. కొన్ని చోట్ల పార్టీ ఆఫీసులకు కాషాయ రంగు పూసి తమ నిరసనను వ్యక్తం చేయడం బెంగాల్ రాజకీయాల్లోని తీవ్రతను చాటిచెబుతోంది. ఈ హింసాకాండపై రాజకీయ వర్గాల్లో పరస్పర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం ఈ దాడులకు పూర్తిగా బీజేపీ కార్యకర్తలే కారణమని, గెలిచిన అహంకారంతో తమ పార్టీ శ్రేణులపై దాడులకు దిగుతున్నారని తీవ్రంగా మండిపడుతున్నారు. తమ కార్యకర్తల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

అయితే, ఈ ఆరోపణలను బీజేపీ ఖండిస్తోంది. ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని, టీఎంసీలోని అంతర్గత కుమ్ములాటలు లేదా ఇన్నాళ్లు వారి పాలనలో ఇబ్బంది పడ్డ స్థానిక ప్రజల ఆగ్రహమే ఈ దాడులకు రూపమని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత చెలరేగిన ఈ అల్లర్లను అరికట్టేందుకు ఎన్నికల కమిషన్ మరియు రాష్ట్ర పోలీసులు రంగంలోకి దిగారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Next Story