- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ విద్యార్థి అమరులకు హుజూరాబాద్‌లో నివాళులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల అమరత్వానికి నివాళిగా హుజూరాబాద్ పట్టణంలో కొవ్వొత్తులతో నివాళి అర్పించి ర్యాలీ నిర్వహించారు.

దిశ,హుజూరాబాద్ రూరల్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల అమరత్వానికి నివాళిగా హుజూరాబాద్ పట్టణంలో కొవ్వొత్తులతో నివాళి అర్పించి ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో 'హుజూరాబాద్ ప్రజా సంఘాల జేఏసీ ' ఆధ్వర్యంలో శనివారం రాత్రి , ప్రజాసంఘాలు, బి ఆర్ఎస్, కాంగ్రెస్,టీజేఎస్ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుండి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా జేఏసీ నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. "విద్యార్థి, యువకుల పోరాట విజయం దేశానికే ఆదర్శం.. రాజ్యాంగాన్ని రక్షించండి.. ఇది అంతం కాదు, మరో పోరాటానికి ఆరంభం మాత్రమే!" అంటూ హోరెత్తించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చారిత్రాత్మక విజయం..
ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ... దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులు, యువకులపై కేంద్ర ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై మోపిన అక్రమ కేసులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆగ్రహజ్వాలలకు, యువజన ఉద్యమానికి దిగివచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించడం తొలి విజయమని వారు పేర్కొన్నారు. ఇది విద్యార్థి లోకపు తిరుగులేని పోరాటానికి నిదర్శనమని అభివర్ణించారు. అనంతరం జేఏసీ నాయకులు టపాకాయలు కాల్చి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ నివాళి కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బిఆర్ఎస్ , టీజేఎస్ పార్టీల ముఖ్య నాయకులు, జేఏసీ ప్రతినిధులు, వివిధ ప్రజాసంఘాల బాధ్యులు,పట్టణ మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భవిష్యత్తులో విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం కలిసికట్టుగా పోరాడతామని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.






