భూత వైద్యుడి కర్కశానికి బలైన గిరిజన మహిళ

by Ratna Kumari |

మూఢనమ్మకాలపై ఆధారపడిన భూత వైద్యం మరో గిరిజన మహిళ ప్రాణాలను బలితీసుకుంది.

భూత వైద్యుడి కర్కశానికి బలైన గిరిజన మహిళ
X

దిశ, భద్రాచలం : మూఢనమ్మకాలపై ఆధారపడిన భూత వైద్యం మరో గిరిజన మహిళ ప్రాణాలను బలితీసుకుంది. గొంతు నొప్పితో భూత వైద్యుడిని ఆశ్రయించిన ఆరు నెలల గర్భిణి, అతడు గొంతు కొరకడంతో తీవ్ర ఇన్ఫెక్షన్‌కు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా, కుంట మండలం మారాయిగూడెం గ్రామానికి చెందిన కురసం హెంకి (ఆరు నెలల గర్భిణి) గొంతు నొప్పితో స్థానిక భూత వైద్యుడిని ఆశ్రయించింది. చికిత్స పేరుతో అతడు మహిళ గొంతును బలంగా కొరకడంతో తీవ్ర గాయమై ఇన్ఫెక్షన్ సోకింది. అనంతరం ముఖం, గొంతు తీవ్రంగా వాచిపోవడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి.

దీంతో ఈ నెల 14న ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆమె చివరకు 26వ తేదీ రాత్రి మృతి చెందింది. ఆసుపత్రికి చేరినప్పటి నుంచే మహిళ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కొన్ని మాధ్యమాల్లో మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడిందని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. మూఢనమ్మకాలను నమ్మి ప్రాణాలు కోల్పోవద్దని, అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులు లేదా అర్హత కలిగిన వైద్యులను సంప్రదించాలని వైద్యులు ప్రజలకు సూచించారు. అయితే, భూత వైద్యుడి పేరు వెల్లడించేందుకు మృతురాలి బంధువులు నిరాకరించినట్లు సమాచారం. దీంతో పోస్టుమార్టం నిర్వహించకుండా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిసింది.

Next Story