- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యాపేట కొత్త బస్టాండ్‌లో ఉద్రిక్తత
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దిశ, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వికలాంగుడిపై ఆర్టీసీ పోలీసు కానిస్టేబుల్ చేయి చేసుకున్నాడన్న ఆరోపణలతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. స్థానికుల కథనం ప్రకారం.. ప్రయాణికులతో వచ్చిన ఓ ఆటోను బస్టాండ్ లోపల ఆర్టీసీ కానిస్టేబుల్ ఆపాడు. ఈ సమయంలో పెన్‌పహాడ్ మండలం అన్నారం గ్రామానికి చెందిన వికలాంగుడు సతీష్ మాట్లాడుతూ.. "ఈ ఆటోలో మా కుటుంబ సభ్యులు ఉన్నారు. వారు దిగే వరకు కొద్దిసేపు ఆగండి" అని కోరినట్లు తెలిపారు.
అయితే, కానిస్టేబుల్ వెంటనే ఆటోను అక్కడి నుంచి తీసివేయాలని చెప్పడంతో పాటు ఆటో తాళాలు తీసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కానిస్టేబుల్ సతీష్‌పై చేయి చేసుకున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆటో తాళాలు లాక్కోవడంతో ఆవేదనకు గురైన సతీష్ ఏడుస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించగా, అక్కడ ఉన్న పలువురు ప్రయాణికులు పోలీసు తీరును తప్పుబట్టినట్లు సమాచారం. దీంతో కొంతసేపు బస్టాండ్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
తర్వాత స్థానికులు, ప్రయాణికులు, పోలీసు అధికారుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.






