- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంతలతో నరకయాతన..
మేళ్లచెరువు మండలంలోని రామాపురం నుంచి కప్పల తండా వరకు ఉన్న రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ, మేళ్లచెరువు : మేళ్లచెరువు మండలంలోని రామాపురం నుంచి కప్పల తండా వరకు ఉన్న రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఫ్యాక్టరీ ఉద్యోగులు, జగ్గయ్యపేటకు రాకపోకలు సాగించే వందలాది మంది నిత్యం అవస్థలు పడుతున్నారు. రోడ్డంతా భారీ గుంతలతో నిండిపోవడంతో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించడం ప్రమాదకరంగా మారింది. వర్షాల కారణంగా గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో వాటి లోతు అంచనా వేయలేక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా రహదారికి ఇరువైపులా పెరిగిన కంపచెట్లు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకుండా అడ్డంకిగా మారడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భారీ ప్రమాదాలు జరిగేలోపు వెంటనే రహదారిలోని గుంతలను పూడ్చి, కంపచెట్లను తొలగించి రహదారిని మరమ్మతు చేసి సురక్షితంగా ప్రయాణించేందుకు అనువుగా మార్చాలని గ్రామస్తులు ప్రభుత్వం, సంబంధిత అధికారులను కోరుతున్నారు. "ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు... ప్రాణాలు కాపాడేలా ఇప్పుడే రోడ్డు మరమ్మతులు చేపట్టాలి" అని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.






