రాష్ట్రంలో ‘ఫిఫా వరల్డ్ కప్’ జోష్.. ఇక తెల్లవారుజాము వరకు మద్యం విక్రయాలు

by Kema Shiva Kumar |

ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల సందర్భంగా తెలంగాణ కీలక నిర్ణయం తీసుకున్నది.

రాష్ట్రంలో ‘ఫిఫా వరల్డ్ కప్’ జోష్.. ఇక తెల్లవారుజాము వరకు మద్యం విక్రయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికులను ఎంతగానో అలరిస్తున్న ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) క్లైమాక్స్‌కు చేరింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచకప్ మ్యాచ్‌ల లైవ్ టెలికాస్ట్‌ను వీక్షించే ఫుట్‌బాల్ ప్రియులు, మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక తెల్లవారుజాము వరకు మద్యం అమ్మకాలకు అనుమతినిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ చేసిన స్పెషల్ రిక్వెస్ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.

కాగా, ఫిఫా వరల్డ్ కప్ థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్ జరిగే జులై 18న అంటే రేపు రాత్రి ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. ఆ ఉత్తర్వుల ప్రకారం జులై 19 తెల్లవారుజామున 4.30 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఉంటుంది. ఇక అత్యంత ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే జులై 19న అర్ధరాత్రి నుంచి 20 తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లలో మద్యం విక్రయాలు జరుపుకునే అవకాశం కల్పించారు. అయితే, ప్రభుత్వం కల్పించిన ఈ ప్రత్యేక అర్ధరాత్రి సమయాల వెసులుబాటు కేవలం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీలకు మాత్రమే వర్తిస్తుందని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఫిఫా ఫైనల్స్ వేళ నగరంలో ఫుట్‌బాల్ ఫీవర్ మరింత ఊపందుకోనుంది.

Next Story