లింక్డ్‌ఇన్‌లో ఎక్కువ ఆ టైప్ కంటెంట్..! ఆ పోస్టుల్లోనూ 40% అదే..

by Javid Pasha |   (  Updated:2026-07-17 12:32:49  IST  )

లాంగ్ ఫార్మ్ పోస్టుల్లో 40% కంటే ఎక్కువ, ఏఐ జనరేటెడ్ కంటెంటే ఉంటున్నదని ఒక అధ్యయనం పేర్కొన్నది

లింక్డ్‌ఇన్‌లో ఎక్కువ ఆ టైప్ కంటెంట్..! ఆ పోస్టుల్లోనూ 40% అదే..
X

దిశ, ఫీచర్స్ : లింక్డ్‌ఇన్ (LinkedIn).. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా ప్రసిద్ధి చెందిన సంస్థ యిది. ఉద్యోగాలు వెతుక్కోవడానికి, వ్యాపార సంబంధాలను పెంపొందించుకోవడానికి, కెరీర్ అభివృద్ధికి ఎంతో ఉపయోగడుతుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే వరల్డ్‌వైడ్‌గా బిలియన్ల కొద్దీ సభ్యులున్న వేదికగా ప్రాచుర్యం పొందింది. అయితే ఒక కొత్త అధ్యయనం దీనిగురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. దీంతో ఆధునిక సాంకేతికత, ఏఐ టెక్నాలజీపై మరోసారి విస్తృతమైన చర్చ జరుగుతున్నది? ఇంతకీ ఏమిటా విషయం? అధ్యయనం చెప్పిందేమిటి?

40% కంటెంట్ అదే..

ఏఐ డిటెక్షన్ స్టార్టప్ పాంగ్రామ్ (AI detection startup Pangram) అధ్యయనం ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ఏఐ సాచురేషన్ ఉన్న ప్రధాన సోషల్ మీడియా వేదికగా లింక్డ్‌ఇన్ నిలిచింది. పైగా ఇందులోని లాంగ్ ఫార్మ్ పోస్టుల్లో 40% కంటే ఎక్కువ, పూర్తిగా ఏఐ ద్వారా రూపొందించబడినవిగా గుర్తించబడ్డాయి. ఇది ఇతర సోషల్ ప్లాట్‌ఫామ్‌ల కంటే ఎక్కువని నిపుణులు అంటున్నారు. అంటే లింక్డ్‌ఇన్ ఒక్కటే ఇతర అన్ని ఏఐ (AI)-జనరేటెడ్ పోస్టుల్లో దాదాపు రెండు మూడింట ఒక వంతు వాటాను కలిగి ఉంది.

జనరేటివ్ ఏఐ ఎఫెక్ట్..

అయితే లింక్డ్‌ఇన్ తన సొంత ఏఐ టూల్స్ (ఉదా: ‘Enhance post’ ఫీచర్) వల్ల ఏఐ కంటెంట్ సాధారణమైపోయిందని అధ్యయనం పేర్కొన్నది. కెరీర్ అడ్వైస్, లీడర్‌షిప్ లెసన్స్ వంటి లాంగ్ పోస్టులు చాలా వరకు దీని ద్వారానే రాబయడుతున్నాయని తెలిపింది. ఇది ఆన్‌లైన్ కమ్యూనికేషన్‌లో జనరేటివ్ ఏఐ ప్రభావాన్ని చూపుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. అదే సందర్భంలో ఏఐ కంటెంట్‌ను గుర్తించడం కష్టంగా మారుతోందని, డిటెక్షన్ స్కోర్లను కేవలం సూచికగా మాత్రమే పరిగణించాలని కూడా నిపుణులు చెబుతున్నారు.

వీటిలో చాలా తక్కువ..

అధ్యయనం ప్రకారం.. ఇతర ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే Redditలో ఏఐ కంటెంట్ చాలా తక్కువగా (కేవలం 4.4%) ఉంది. దీని రిప్లైలలో 98.1% హ్యూమన్ రాసినవే కాగా, టాప్ లెవల్ పోస్టుల్లో 11.6% ఏఐ జనరేటెడ్ ఉన్నాయి. X (ట్విట్టర్)లో కూడా సుమారు 10% ఏఐ సాచురేషన్ ఉంది. లాంగ్ ఫార్మ్ కంటెంట్ (250+ వర్డ్స్) అన్ని ప్లాట్‌ఫామ్‌లలోనూ ఎక్కువగా ఏఐ (AI) ద్వారా రాయబడుతోంది(సగటున 25.72%). అయితే ఈ ట్రెండ్‌కు మినహాయింపు Substack మాత్రమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇదొక పే-వాల్/సబ్‌స్క్రిప్షన్ ప్లాట్‌ఫామ్ కావడంవల్ల రైటర్స్ తమ సబ్‌‌స్ర్కైబర్ల నుంచి నేరుగా డబ్బు సంపాదిస్తారు. ఏది ఏమైనా ఇప్పుడు ఏఐ జనరేటెడ్ కంటెంట్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఇదొక సమస్యగా మారుతోంది. ఎందుకంటే అన్‌డిస్‌క్లోజ్డ్ ఏఐ కంటెంట్‌తో నిండిన ఇంటర్నెట్ గందరగోళంగా మారుతోందని, అయితే ఏఐ మాత్రమే కాకుండా నియంత్రించే అవకాశం కూడా ఉందని నిపుణులు అంటున్నారు.

Next Story