- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్
బ్రిటన్ నూతన ప్రధానమంత్రి (UK New PM)గా లేబర్ పార్టీ (Labour Party) నేతగా ఆండీ బర్న్‌హామ్ (Andy Burnham) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : బ్రిటన్ నూతన ప్రధానమంత్రి (UK New PM)గా లేబర్ పార్టీ (Labour Party) నేతగా ఆండీ బర్న్‌హామ్ (Andy Burnham) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లండన్‌లో నిర్వహించిన పార్టీ ప్రత్యేక సమావేశంలో లేబర్ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్ షబానా మహ్మద్ ఈ అధికారిక ప్రకటన చేశారు. ఇటీవల కీర్ స్టార్మర్ (Keir Starmer) తన ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో బ్రిటన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. బ్రిటన్ రాజ్యాంగం ప్రకారం, లేబర్ పార్టీ నూతన నేతగా ఎన్నికైన ఆండీ బర్న్‌హామ్‌ను కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3 (King Charles III) రాబోయే సోమవారం అధికారికంగా ఆహ్వానించనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం, వచ్చే వారంలోనే ఆండీ బర్న్‌హామ్ 10 డౌనింగ్ స్ట్రీట్‌లో బ్రిటన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆండీ బర్న్‌హామ్ గురించి
ఆండీ ముర్రే బర్న్‌హామ్ 1970లో ఇంగ్లాండ్‌లోని మెర్సీసైడ్‌లో జన్మించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి విద్యనభ్యసించి రాజకీయాలపై ఆసక్తితో లేబర్ పార్టీలో చేరారు. 2001 నుంచి 2017 వరకు సుదీర్ఘ కాలం పాటు ఎంపీగా సేవలందించారు. మాజీ ప్రధాని గార్డెన్ బ్రౌన్ క్యాబినెట్‌లో ట్రెజరీ, కల్చరల్, హెల్త్ మినిస్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. లేబర్ పార్టీ నాయకత్వం కోసం 2015, 2017 లో పోటీ చేసి విఫలమైనప్పటికీ, ఆయన అధైర్యపడలేదు. లండన్ రాజకీయాలను పక్కనబెట్టి 2017లో 'గ్రేటర్ మాంచెస్టర్' మేయర్‌గా ఎన్నికై, అక్కడి ప్రజల మన్ననలు పొందారు. కాగా పార్టీలో కీర్ స్టార్మర్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బర్న్‌హామ్.. ఇటీవల జరిగిన 'మేకర్‌ఫీల్డ్' పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి మళ్లీ హౌస్ ఆఫ్ కామన్స్‌లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం లేబర్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, ఎంపీగా గెలిచిన ఆయనకు దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించేందుకు మార్గం సుగమమైంది.






