ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. ‘ధరణి’పై దర్యాప్తునకు ‘సిట్’ ఏర్పాటు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-17 14:12:53  IST  )

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.

ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. ‘ధరణి’పై దర్యాప్తునకు ‘సిట్’ ఏర్పాటు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయం వేదికగా దాదాపు మూడు గంటల పాటు నిర్విరామంగా జరిగిన కేబినెట్ భేటీ కాసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న పలు కీలక అంశాలపై చర్చించి మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇందులో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ రికార్డుల ప్రక్షాళన కొరకు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్‌పై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ‘ధరణి’ పోర్టల్ నిర్వహణ, అందులో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరిపేందుకు ఓ ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT - Special Investigation Team) ఏర్పాటు చేసేందుకు కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. అయితే, గత కొన్నేళ్లుగా ధరణి పోర్టల్‌లో ఉన్న లొసుగులు, దాని ఆధారంగా జరిగిన భూ ఆక్రమణలు, వివాదాస్పద లావాదేవీలపై ‘సిట్’ సమగ్రంగా దర్యాప్తు చేపట్టనుంది. ఎవరెవరి భూములు అక్రమంగా చేతులు మారాయి..? అందులో ఎవరి ప్రమేయం ఎంత అనే కోణంలో విచారణ అధికారులు ఆధారాలు సేకరించనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ లావాదేవీల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరింత పొలిటికల్ హీట్ పెంచే అవకాశం కనిపిస్తోంది.

మరికొన్ని కీలక నిర్ణయాలు ఇవే..

అదేవిధంగా ఈ మంత్రివర్గ సమావేశంలో విద్యాశాఖలో పోస్టుల భర్తీకి కూడా ఆమోదం తెలిపారు. సంగారెడ్డిలో వివిధ సంస్థలకు గాను భూ కేటాయింపులకు ఆమోదముద్ర వేశారు. ఇక నీటిపారుదల రంగానికి సంబంధించి పాలమూరు ప్రాజెక్టుకు పెరిగిన అంచానాలకు ఆమోదం తెలిపారు. ఇక బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్పులకు కూడా ఓకే చెప్పేశారు. గ్రామ పంచాయతీల ఆర్థిక వెసులుబాటకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా జిగిత్యాల జిల్లాలో డిగ్రీ కాలేజ్‌లో పోస్టుల భర్తీకి, పటాన్‌చెరులో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Next Story