ఆటోనగర్ అభివృద్ధిలో సీపీఐ పాత్ర కీలకం

by Ratna Kumari |

ఆటోనగర్ అభివృద్ధిలో సీపీఐ పాత్ర కీలకమని ఆ పార్టీ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్ తెలిపారు.

ఆటోనగర్ అభివృద్ధిలో సీపీఐ పాత్ర కీలకం
X

దిశ, ఖమ్మం రూరల్ : ఆటోనగర్ అభివృద్ధిలో సీపీఐ పాత్ర కీలకమని ఆ పార్టీ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్ తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆటోనగర్‌కు సంబంధించి ఇటీవల పత్రికలో వచ్చిన కథనంపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికే సీపీఐ నాయకుల బృందం అక్కడికి వెళ్లి పరిశీలించిందన్నారు. తమ పార్టీ నాయకుడిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని నిరూపించేందుకే ఆ ప్రాంతాన్ని సందర్శించామని, అంతేకానీ శ్రీ సిటీ ఎండీ గరికపాటి వెంకట్రావు కాల్వను కబ్జా చేశారని తాము ఎక్కడా ఆరోపించలేదని స్పష్టం చేశారు.

కేవలం కాల్వ అలైన్‌మెంట్ మార్పు అంశాన్ని మాత్రమే ప్రస్తావించామని, దానిపై వివరణ కోరామని తెలిపారు. ఆటోనగర్ అభివృద్ధిలో దివంగత సీపీఐ నాయకుడు, ప్రగతి కో-ఆపరేటివ్ ఆటోనగర్ మాజీ ఉపాధ్యక్షుడు షాబాద్ నారాయణరెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అలాగే ఆటోనగర్ ఏర్పాటుకు సీపీఐ పూర్తి సహకారం అందించిందని, ప్రస్తుతం ఆటోనగర్ ఏర్పాటైన ప్రాంతంలోని భూములు సీపీఐ పార్టీకి చెందిన రైతులవేనని పేర్కొన్నారు. వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలు మానుకుని నిజానిజాలను ప్రజల ముందుంచాలని సంబంధిత వర్గాలకు పుచ్చకాయల సుధాకర్ సూచించారు.

Next Story