వృద్ధ దంపతుల ఫిర్యాదు..

by Ratna Kumari |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఇల్లందులపాడు తండాలో కుటుంబ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వృద్ధ దంపతుల ఫిర్యాదు..
X

దిశ, పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఇల్లందులపాడు తండాలో కుటుంబ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమను సొంత ఇంటి నుంచి బయటకు పంపించాడంటూ కేటీపీఎస్‌లో డివిజనల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కుమారుడిపై వృద్ధ దంపతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఆరోపణలను కుమారుడు ఖండిస్తూ తన వాదనను వెల్లడించారు. బాధితులు భూక్యా లక్ష్మి, మంగ్య దంపతులు జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన ఫిర్యాదులో.. తమకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని, పెద్ద కుమారుడు భూక్యా పుల్యాను ఎన్నో కష్టనష్టాలు పడి చదివించి ఉన్నత ఉద్యోగం వచ్చేలా చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పాల్వంచ కేటీపీఎస్‌లో డివిజనల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. కుమారుడి చదువు కోసం కుటుంబమంతా త్యాగాలు చేసిందని, ఉద్యోగం వచ్చిన తర్వాత కుటుంబానికి అండగా ఉంటాడని భావించామని, కానీ క్రమంగా తమను దూరం చేశాడని ఆరోపించారు. ఇటీవల తాము నివసిస్తున్న ఇంటిని ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చి, నిరాకరించడంతో ఇంటి సామాన్లు బయటకు విసిరేసి తమను ఇంటి నుంచి పంపించి తాళం వేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో తన భార్యతో కలిసి తమపై దాడి కూడా చేశారని ఆరోపించారు. వృద్ధాప్యంలో ఆధారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ కష్టార్జితంతో నిర్మించుకున్న ఇంటిని తిరిగి అప్పగించి రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నారు.

చావే శరణ్యం అనిపించింది..

జీవితమంతా పిల్లల కోసమే కష్టపడ్డామని, ఇప్పుడు తమనే ఇంటి నుంచి బయటకు పంపించడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని బాధిత దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.

కుమారుడి వివరణ..

ఈ ఆరోపణలను కేటీపీఎస్ డివిజనల్ ఆఫీసర్ భూక్యా పుల్యా ఖండించారు. తన తమ్ముళ్లు తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తన వివాహ సమయంలో వచ్చిన కట్న కానుకలతో ఆ ఇంటిని నిర్మించానని, ఇంటిలో రెండు పోర్షన్లు ఉన్నాయని, ఒక పోర్షన్‌లో తల్లిదండ్రులు ఉండి మరో పోర్షన్‌ను తనకు ఇవ్వాలని పలుమార్లు కోరానని తెలిపారు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశానన్నారు. తనకు వారసత్వంగా రావాల్సిన భూమిని కూడా ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నారని, ఆ ఇంటిని తన పేరుకు రాసిచ్చిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. స్థానికులను అడిగినా వాస్తవాలు తెలుస్తాయని, ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్న తాను ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు చెప్పడం అవాస్తవమని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం అధికారుల పరిశీలనలో ఉంది. ఇరుపక్షాల వాదనలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన అనంతరం వాస్తవాలు వెల్లడికానున్నాయి.

Next Story