కత్తులతో స్కూల్ ప్రిన్సిపాల్ హల్ చల్.. హడలిపోయిన విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు

by Prasad Jukanti |

యూపీలో ఒక ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్ కత్తి, చాకుతో రావడంతో కలకలం రేగింది. ఆమెపై కేసు నమోదు చేసి, సస్పెండ్ చేశారు.

కత్తులతో స్కూల్ ప్రిన్సిపాల్ హల్ చల్.. హడలిపోయిన విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చేతిలో కత్తి, పెద్ద చాకు పట్టుకుని స్కూల్ ఆవరణలో హల్ చల్ చేయడం తీవ్ర కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు, పోలీసులు తక్షణమే స్పందించారు. సదరు ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయడంతో పాటు ఆమెపై కేసు నమోదు చేశారు.

ఏం జరిగింది?:

కౌశాంబి జిల్లాలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శిఖా సింగ్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. అయితే ఆమె ఇటీవల పాఠశాలకు వస్తూ తనతో పాటు ఒక పదునైన కత్తి, పెద్ద చాకును (Cleaver) వెంట తెచ్చుకున్నారు. పాఠశాలకు రాకముందే కొందరు తల్లిదండ్రులకు ఆ ఆయుధాలను చూపించినట్లు సమాచారం. స్కూల్ లోపల కూడా ఆమె ఆ ఆయుధాలతో కనిపించడంతో పిల్లలు, తోటి ఉపాధ్యాయులు తీవ్ర భయానికి లోనయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO) నీరజ్ ఉమ్రావ్, పోలీసు బృందంతో కలిసి వెంటనే పాఠశాలకు చేరుకున్నారు.

సమర్ధించుకున్న ప్రిన్సిపాల్:

అధికారులు ఆ కత్తులను స్వాధీనం చేసుకుని ప్రశ్నించగా.. ప్రిన్సిపాల్ శిఖా సింగ్ వింత సమాధానం ఇచ్చారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ లేనందువల్లే వాటిని వెంట తెచ్చుకున్నానని ఆమె సమర్థించుకున్నారు. అయితే, తనను ఎవరు బెదిరించారు? ఎవరి వల్ల ముప్పు ఉందనే విషయాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. మరోవైపు విచారణలో భాగంగా అధికారులు ఆమె భర్తను సంప్రదించగా.. ఆమె కొంతకాలంగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఆయన అధికారులకు తెలిపారు. అయితే, ఈ ఘటనకు ఆమె మానసిక స్థితికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ప్రిన్సిపాల్ శిఖా సింగ్‌ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

Next Story