పూరీ రథయాత్రలో తొక్కిసలాట జరగలేదు : ఒడిశా ప్రభుత్వం

by Muthe.Rajitha |

ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర(Puri Jgannatha Rathayatra)లో గురువారం జరిగిన విషాద ఘటనలపై ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) కీలక స్పష్టతనిచ్చింది.

పూరీ రథయాత్రలో తొక్కిసలాట జరగలేదు : ఒడిశా ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్ : ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర(Puri Jgannatha Rathayatra)లో గురువారం జరిగిన విషాద ఘటనలపై ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) కీలక స్పష్టతనిచ్చింది. రథయాత్ర సందర్భంగా పూరీలో ఎలాంటి తొక్కిసలాట (Stampede) జరగలేదని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రథయాత్రలో క్రౌడ్ మేనేజ్‌మెంట్ వైఫల్యాలు లేవని పేర్కొంది. పండుగ సందర్భంగా మరణించిన ఇద్దరు భక్తులు పూర్తిగా అనారోగ్య కారణాల వల్లే ప్రాణాలు కోల్పోయారని సీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. రథయాత్రలో భారీ జనసమూహం, ఉక్కపోత మధ్య 60 ఏళ్లు పైబడిన ఓ వృద్ధ భక్తుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మరణించారు. ఇక 35 ఏళ్ల అనిల్ అనే మరో భక్తుడు గుండెపోటు (Cardiac Arrest) కారణంగా మరణించాడని తెలిపింది. వైద్యులు తక్షణమే స్పందించి అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ రెండు మరణాలు వేర్వేరు సందర్భాల్లో జరిగాయని, వీటికి తొక్కిసలాటతో ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

భారీ వర్షం.. డీహైడ్రేషన్

జూలై 16న పూరీలో భారీ వర్షం కురవడం, సుమారు 8 నుండి 9 లక్షల మంది భక్తులు ఒకేసారి తరలిరావడంతో వాతావరణం తేమగా మారింది. ఈ ప్రతికూల పరిస్థితుల వల్ల కొందరు భక్తులు డీహైడ్రేషన్, ఉక్కపోతకు గురై స్పృహతప్పారు. వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లు, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది వారికి ప్రథమ చికిత్స అందించి, పూరీ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చాలా మంది భక్తులు కోలుకుని ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. గత ఏడాది (2025) గుండిచా ఆలయం వద్ద జరిగిన అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది ఒడిశా ప్రభుత్వం ముందస్తుగానే భారీ రక్షణ చర్యలు చేపట్టింది. ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ODRAF), ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), పోలీసులు, ఆరోగ్య శాఖల సమన్వయంతో నిరంతర నిఘా ఉంచారు. రథాలు లాగడం, అనుబంధ పూజా కార్యక్రమాలతో కూడిన గుండిచా యాత్ర మొత్తం ప్రశాంతంగా ముగిసిందని ప్రభుత్వం తెలిపింది. రథయాత్ర విజయవంతం కావడానికి సహకరించిన సేవాయత్లకు, భక్తులకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story