- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్కంఠకు తెర.. ‘బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు’కు హైకోర్టు అనుమతి
తెలంగాణలో నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై పోరాటానికి సిద్ధమైన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి న్యాయస్థానంలో ఊరట లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై పోరాటానికి సిద్ధమైన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి న్యాయస్థానంలో ఊరట లభించింది. హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో శనివారం (జూలై 18) నిర్వహించ తలపెట్టిన 'యువ సంగ్రామ సదస్సు'కు తెలంగాణ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. శాంతిభద్రతల దృష్ట్యా తొలుత పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించగా, బీఆర్ఎస్ నాయకులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. కొన్ని షరతులతో కూడిన అనుమతులను ఇస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేపు సరూర్ నగర్ వేదికగా ఈ భారీ బహిరంగ సభ జరగడం ఖాయమైంది.
కాంగ్రెస్‌పై పోరాటం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను రాష్ట్రానికి తీసుకొచ్చి నిరుద్యోగులకు, విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చారని బీఆర్ఎస్ యువజన విభాగం నేతలు ఆరోపిస్తున్నారు. సరిగ్గా ఏ వేదికపై నుంచైతే కాంగ్రెస్ పార్టీ 'యూత్ డిక్లరేషన్' ప్రకటించిందో.. అదే సరూర్ నగర్ స్టేడియంలో ఈ సదస్సును నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గులాబీ దళం వ్యూహం రచించింది. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఫీజ్ రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో వాగ్దానాలతో యువతను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం... ఇప్పటివరకు వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ మండిపడుతోంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలనే ప్రధాన డిమాండ్ ఈ ‘యువ సంగ్రామ సదస్సు’ను నిర్వహిస్తున్నట్లు పార్టీ స్పష్టం చేసింది.
కోర్టు అనుమతితో కేడర్లో జోష్..
పోలీసుల ఆంక్షలు, అనుమతి నిరాకరణల నేపథ్యంలో సభ జరుగుతుందా? లేదా? అనే ఉత్కంఠకు హైకోర్టు తీర్పుతో తెరపడింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున తరలిరావాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై. నిరుద్యోగుల పోరాట కార్యాచరణను ప్రకటించనున్నారు.






