రోడ్డెక్కిన గిరిజన గురుకుల విద్యార్థినులు

by Jakkula.Mamatha |

పేద, గిరిజన బాలికలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలోనే చదువు కంటే కష్టాలే ఎక్కువయ్యాయని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డెక్కిన గిరిజన గురుకుల విద్యార్థినులు
X

దిశ,కొత్తగూడ: పేద, గిరిజన బాలికలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలోనే చదువు కంటే కష్టాలే ఎక్కువయ్యాయని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని గాంధీనగర్ గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో నెలకొన్న తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలపై గురువారం విద్యార్థినులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. పాఠశాల ప్రారంభమై నెల రోజులు గడిచినా తాగేందుకు స్వచ్ఛమైన నీరు అందడం లేదని, వినియోగానికి తగిన బాత్రూంలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థినులు ఆరోపించారు.

ఉదయం నిద్రలేవగానే వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా నీళ్లు లేవు, బాత్రూములు వాడలేం. తాగడానికి కూడా మంచినీళ్లు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో చదువు ఎలా సాగుతుంది? అంటూ పలువురు విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. బాత్రూం వినియోగానికి లేకపోవడంతో బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోందని, అక్కడ పాముల సంచారం ఉండటంతో భయాందోళనల మధ్య కాలం గడుపుతున్నామని వారు తెలిపారు. సమస్యను పలుమార్లు పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపలేదని ఆరోపించారు. టాయిలెట్స్ మరమ్మతుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 చొప్పున వసూలు చేశారని, అయినప్పటికీ పనులు చేపట్టలేదని విద్యార్థినులు పేర్కొన్నారు.

అలాగే సమస్యలు బయటకు చెబితే అంతర్గత మార్కులు తగ్గిస్తామని, బయట చెప్పవద్దని ప్రిన్సిపాల్ హెచ్చరించారని కూడా ఆరోపించారు. ఈ కారణంగా ఇంత కాలం మౌనంగా ఉన్నామని, ఇక భరించలేక రోడ్డెక్కామని చెప్పారు.ఆందోళన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొత్తగూడ ఎస్సై రాజ్‌కుమార్ పోలీసు బందోబస్తు నిర్వహించి విద్యార్థినులకు ధైర్యం చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగూడ మండల అధ్యక్షుడు బానోత్ రూప్ సింగ్ సమస్యను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించిన మంత్రి సీతక్క..

వెంటనే స్పందించిన మంత్రి సీతక్క విద్యార్థినులతో ఫోన్‌లో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలు తేలిన మేరకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే తాగునీరు తదితర సమస్యలను 12 గంటల్లో పరిష్కరించేలా అధికారులను ఆదేశిస్తామని, "మీకు నేను అండగా ఉంటాను.. ఎలాంటి భయం అవసరం లేదు" అంటూ విద్యార్థినులకు భరోసా కల్పించారు. మంత్రి హామీతో విద్యార్థినులు తమ ఆందోళనను విరమించారు. అయితే గురుకులంలో నెలకొన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి, విద్యార్థినులకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని వారు కోరుతున్నారు.

Next Story