ట్రెండ్ అవుతున్న "నో ఫోన్ ఛాలెంజ్"

by Muthe.Rajitha |

కేరళలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మొదలైన "నో ఫోన్ ఛాలెంజ్" ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ట్రెండ్ అవుతోంది.

ట్రెండ్ అవుతున్న నో ఫోన్ ఛాలెంజ్
X

దిశ, వెబ్ డెస్క్ : కేరళలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మొదలైన "నో ఫోన్ ఛాలెంజ్" ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవడంతో ఇతర రాష్ట్రాల్లోనూ నో ఫోన్ ఛాలెంజ్ జోరందుకుంది. చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లకు ఎక్కువగా అలవాటు పడుతున్నారని గమనించిన కేరళలోని కన్నూర్ జిల్లా, కూతుపరంబలో ఉన్న ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల టీచర్ అమృత.. ఫోన్ వాడకాన్ని తగ్గించేందుకు ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించారు. అయితే మొదట క్లాస్‌లో పాఠాలు చెప్పేటప్పుడు పిల్లలు ఎక్కువసేపు కూర్చుని శ్రద్ధగా వినడం లేదని, కొద్దిసేపటికే దృష్టి మళ్లిపోతోందని గమనించిన అమృత.. పిల్లలు ఫోన్లలో రీల్స్ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం వలన వారి దృష్టి సామర్థ్యం తగ్గిపోయిందని గుర్తించారు.

ఇది పిల్లల చదువుపై ప్రభావం చూపుతోందని, ఎలాగైనా వారిని ఫోన్ అడిక్షన్ నుంచి బయట పడేయాలని.. కొంతకాలం మొబైల్ ఫోన్ వాడకుండా ఉండేలా ఒక ఛాలెంజ్ మొదలుపెట్టారు. అయితే ఈ నియమాన్ని కఠినంగా కాకుండా, సరదాగా అమలు చేశారు. పిల్లలు ఫోన్ ముట్టుకోకుండా ఉంటే, వారికి స్టార్ స్టిక్కర్లు, చిన్న బహుమతులు, ఆటలు, పెన్నులు లాంటివి ఇచ్చారు. దీని వల్ల పిల్లల్లో మంచి పోటీ ఏర్పడింది. ఎవరు ఎక్కువ రోజులు ఫోన్ వాడకుండా ఉంటారో అని అందరూ ప్రయత్నించారు. ఈ ఛాలెంజ్ వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. పిల్లలు క్లాస్‌లో ఎక్కువగా దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. కథలు చెప్పడం, ఆటలు ఆడటం, మట్టి పనులు చేయడం వంటి ఆఫ్‌లైన్ యాక్టివిటీలు పెరిగాయి.

పిల్లలు మొబైల్ లేకుండానే సరదాగా గడపగలమని తెలుసుకున్నారు. ఈ ప్రయత్నం పిల్లలకు మాత్రమే కాదు, తల్లిదండ్రులకు కూడా విసిరింది ఆ టీచరమ్మ. దీంతో వారు కూడా రోజులో కొంతసమయం ఫోన్ వాడకుండా పిల్లలతో గడిపేందుకు సమయం పెట్టుకున్నారట. దీంతో ఈ ఛాలెంజ్ ఒక ట్రెండ్ లాగ మారి కొద్దిరోజుల్లోనే అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలకు పాకింది. దీంతో ఇపుడు కేరళలోని స్కూల్స్ లో కాలేజీల్లో నో ఫోన్ ఛాలెంజ్ ఒక పెద్ద ట్రెండ్ అయింది. ఒకరితో ఒకరు పోటీపడి పిల్లలు రోజుల తరబడి కూడా ఫోన్ ముట్టుకోకుండా ఉంటున్నారట. ఇక ఈ ట్రెండ్ సోషల్ మీడియాకు పాకడంతో మెల్లగా ఇతర రాష్ట్రాలక నగరాలకు కూడా చేరి నో ఫోన్ ఛాలెంజ్ వైరల్ అవుతోందని సమాచారం.

Next Story