లేని రోగానికి చికిత్స.. రోగికి ప్రాణసంకటం!

by Jakkula.Mamatha |

వైద్యుల నిర్లక్ష్యానికి ఓ పేద మహిళ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని మిర్జాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

లేని రోగానికి చికిత్స.. రోగికి ప్రాణసంకటం!
X

దిశ, జహీరాబాద్: వైద్యుల నిర్లక్ష్యానికి ఓ పేద మహిళ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని మిర్జాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ల్యాబ్ రిపోర్టులు తారుమారవ్వడం, వాటిని గమనించకుండా వైద్యులు గుడ్డిగా చికిత్స అందించడంతో ఒక ఆరోగ్యవంతమైన మహిళ పక్షవాతం బారిన పడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడింది. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే..?

గంగ్వార్ గ్రామానికి చెందిన ముత్తమ్మ(35) అనే మహిళ జ్వరంతో స్థానిక మిర్జాపూర్ ఆస్పత్రికి వెళ్లగా, అక్కడి సిబ్బంది ఆమెకు రక్త పరీక్షలు నిర్వహించారు. అయితే, అదే సమయంలో ఆర్. సువర్ణ (62) అనే వృద్ధురాలికి చేసిన బ్లడ్ రిపోర్టును, ముత్తమ్మ రిపోర్టుగా తారుమారు చేశారు.వయసులో, రోగంలో ఎంతో తేడా ఉన్నప్పటికీ..వైద్యులు కనీసం పేర్లు కూడా సరిచూసుకోకుండా సువర్ణ రిపోర్టు ఆధారంగా ముత్తమ్మకకు హైడోస్ మందులు, ఇంజెక్షన్లతో చికిత్స ప్రారంభించారు.

పక్షవాతానికి దారి తీసిన వైద్యం..

లేని రోగానికి హైడోస్ మందులు వాడడంతో ముత్తమ్మ ఆరోగ్యం క్షణాల్లో క్షీణించింది. ఒక్కసారిగా తల బరువెక్కడం, కాళ్లు, చేతులు పడిపోయి పక్షవాతం (ప్యారలైజ్) లక్షణాలు కనిపించడంతో ఆమె ప్రాణసంకట స్థితికి చేరుకుంది. బాధితురాలి పరిస్థితి విషమించడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తక్షణమే ఆమెను కర్ణాటకలోని బీదర్ నగరంలో గల ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

బీదర్ వైద్యుల అప్రమత్తతతో దక్కిన ప్రాణాలు

బీదర్ వైద్యులు ముత్తమ్మకు మరోసారి రక్త పరీక్షలు నిర్వహించగా, జహీరాబాద్‌లో జరిగిన తప్పు బయటపడింది. పాత రిపోర్టు తారుమారైందని గుర్తించిన వైద్యులు, కొత్త రిపోర్టు ఆధారంగా ఆమెకు అత్యవసర చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ ముత్తమ్మ ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ.. నిర్లక్ష్యంగా వ్యవహరించి తన ప్రాణాల మీదకు తెచ్చిన స్థానిక ఆసుపత్రి తీరుపై బాధితురాలు కన్నీరుమున్నీరవుతూ ఆవేదన వ్యక్తం చేసింది. ల్యాబ్ టెక్నీషియన్లు, వైద్యుల నిర్లక్ష్యం పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గంగ్వార్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

నా దృష్టికి రాలేదు: డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి

"ఈ విషయమై స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డిని వివరణ కోరగా.. ల్యాబ్ రిపోర్టులు తారుమారైన ఉదంతం గానీ, బాధితురాలికి తప్పుడు చికిత్స అందించిన విషయం గానీ ఇప్పటివరకు తన దృష్టికి రాలేదని పేర్కొన్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు."

Next Story