- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిజిటల్ ప్రపంచంలోకి మహిళా సంఘాలు.. మన స్త్రీనిధి యాప్ ప్రత్యేకతలు
మహిళా సంఘాల రుణ చెల్లింపుల్లో పారదర్శకత కోసం 'మన స్త్రీనిధి' యాప్.. బ్యాంకుల తిప్పలు లేకుండా ఇంటి నుండే చెల్లింపులు, అవినీతికి చెక్!

దిశ, వెబ్ డెస్క్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద మహిళల ఆర్థిక సాధికారతకు, వారి స్వయం సమృద్ధికి 'స్త్రీనిధి' సంస్థ కొండంత అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళా సంఘాలను డిజిటల్ ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు. మహిళా సంఘాలు తీసుకునే రుణాల ప్రక్రియను మరింత సులభతరం, పారదర్శకం చేసేందుకు "మన స్త్రీనిధి" (Mana Streenidhi) మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టారు. ఈ యాప్ మహిళా సంఘాల్లో పెద్ద మార్పును తీసుకువస్తోంది. మహిళా సంఘాల సభ్యులు చెల్లించే రుణాల రికార్డులు అత్యంత పారదర్శకంగా ఉంచడమే లక్ష్యంగా ఈ యాప్ పనిచేస్తుంది.
బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు..
గతంలో మహిళా సంఘాల సభ్యులు తమ రుణాల నెలవారీ వాయిదాలు (EMI) చెల్లించాలంటే బ్యాంకుల చుట్టూ తిరుగుతూ, గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వచ్చేది. దీనివల్ల వారి రోజువారీ కూలీ కోల్పోవడంతో పాటు సమయం వృథా అయ్యేది. కానీ, ఇప్పుడు 'మన స్త్రీనిధి' యాప్ ద్వారా సభ్యులు తమ ఇంటి వద్ద నుంచే క్షణాల వ్యవధిలో డిజిటల్ పద్ధతిలో రుణాలను చెల్లించవచ్చు. దీనివల్ల విలువైన సమయం ఆదా అవ్వడమే కాకుండా, తాము చెల్లించిన ప్రతి పైసాకూ యాప్‌లోనే పక్కా రసీదులు, లెక్కలు లభిస్తాయి. 'స్త్రీనిధి పంచ సూత్రాల'ను పాటిస్తూ మహిళలు ఈ డిజిటల్ సేవలను వినియోగించుకుంటున్నారు.
యాప్‌లోని ప్రధాన ప్రత్యేకతలు- సదుపాయాలు
నేరుగా రుణ దరఖాస్తు: సంఘం సభ్యురాలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా నేరుగా తన మొబైల్ యాప్ ద్వారానే కొత్త రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సభ్యురాలి లోన్ లెడ్జర్: తాను ఎంత రుణం తీసుకుంది? ఎంత చెల్లించింది? ఇంకా ఎంత బకాయి ఉందనే పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు సులభంగా చూసుకోవచ్చు.
చిన్న సంఘాల లావాదేవీలు: చిన్న చిన్న సంఘాల అంతర్గత లావాదేవీల రికార్డులను కూడా ఈ యాప్ ద్వారానే నిర్వహించవచ్చు.
భీమా వివరాలు: లోన్ భీమా, ప్రమాద భీమా (Insurance) వంటి భద్రతా పరమైన వివరాలు యాప్‌లోనే అందుబాటులో ఉంటాయి.
మహిళలకే సర్దుబాటు హక్కు: చిన్న సంఘం చెల్లించిన రుణ మొత్తాన్ని ఏ సభ్యురాలికి ఎంత సర్దుబాటు చేయాలో (Loan adjustment) వాళ్లే స్వయంగా చేసుకునే వీలు కల్పించారు.
అవినీతి తిమింగలాలకు, అక్రమాలకు చెక్..
ఈ మధ్య కాలంలో కొన్ని మహిళా సంఘాల్లో పేద మహిళల డబ్బులు కాజేసిన అధికారులు, కోట్లతో ఉడాయించిన సిబ్బంది, మోసపోయి పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కుతున్న మహిళల వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. రూపాయి రూపాయి కూడబెట్టుకుని పేద మహిళలు కట్టే సొమ్ము పక్కదారి పట్టకుండా ఉండటానికి ఈ డిజిటల్ చెల్లింపుల విధానం ఒక 'బ్రహ్మాస్త్రం' లా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వ్యవస్థలో జవాబుదారీతనం పెరిగి, అవినీతికి పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని అంచనా వేస్తున్నారు.
AI వీడియోల ద్వారా డిజిటల్ అవగాహన
"మన స్త్రీనిధి యాప్ ద్వారా రుణ చెల్లింపుల ప్రక్రియ పై మహిళా సంఘాల సభ్యులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. ఇందుకోసం క్షేత్రస్థాయిలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు (Training Programs), డిజిటల్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లోని నిరక్షరాస్యులైన మహిళలకు సైతం సులభంగా అర్థమయ్యే రీతిలో అత్యాధునిక AI (కృత్రిమ మేధ) వీడియోల ద్వారా ప్రత్యేకంగా వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నాం.":– మల్లెపూల సుభాష్, స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్.






