ప్రైవేటు అడ్డాలుగా మారిన ప్రయాణ ప్రాంగణాలు

by Batti.Sumithra |

'ప్రయాణ ప్రాంగణం'.. ఇది పేరుకే ప్రభుత్వ బస్టాండ్. కానీ, ఇక్కడ బస్సులు మాత్రం ఆగవు.

ప్రైవేటు అడ్డాలుగా మారిన ప్రయాణ ప్రాంగణాలు
X

దిశ, వర్గల్ : 'ప్రయాణ ప్రాంగణం'.. ఇది పేరుకే ప్రభుత్వ బస్టాండ్. కానీ, ఇక్కడ బస్సులు మాత్రం ఆగవు. ప్రయాణికులకు ఆశ్రయం కల్పించాల్సిన ఈ ప్రాంగణం, నేడు ప్రైవేటు వాహనాలకు అడ్డాగా మారింది. ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంటే, ప్రయాణికులు రోడ్లపైనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. సాక్షాత్తు మాజీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఈ నిర్లక్ష్యం పై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు.

రూ. 50 లక్షలు.. ఫలితం సున్నా..

మండల కేంద్రమైన వర్గల్‌లో ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు సర్వే నంబర్ 991లోని పలు దుకాణాలను తొలగించి, ఆ స్థలాన్ని ఆర్టీసీకి అప్పగించారు. 2018 జనవరి 29న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా, 2020 జూలై 30న అప్పటి మంత్రి హరీశ్ రావు దీనిని ప్రారంభించారు. రూ. 50 లక్షల ప్రజాధనంతో నిర్మాణం పూర్తి చేసినా, అప్పటి నుంచి నేటి వరకు ఆర్టీసీ బస్సులు ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన దాఖలాలు లేవు. వర్గల్ మీదుగా వెళ్లే బస్సులు కూడా బస్టాండ్‌లోకి రాకుండా రాజీవ్ రహదారి పై నుంచే వెళ్ళిపోతున్నాయి. దీంతో ఈ ప్రాంగణం ప్రైవేటు వాహనాలకు అడ్డాగా మారింది తప్ప, ప్రయాణికులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు.

గౌరారంలో నడిరోడ్డే బస్టాండ్..

వర్గల్, మర్కూక్ మండలాల పరిధిలోని అనేక గ్రామాలకు కూడలిగా ఉన్న గౌరారం స్టేజీ వద్ద పరిస్థితి మరీ దారుణం. ఇది సిద్దిపేట, గజ్వేల్, సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు ప్రధాన కేంద్రం. గతంలో ఇక్కడ ప్రయాణికుల కోసం ఉన్న బస్ షెల్టర్‌ను రాజీవ్ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా తొలగించారు. ఆ తర్వాత దాని పునర్నిర్మాణం చేపట్టకపోవడంతో, ప్రయాణికులు నడిరోడ్డుపైనే బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. వానొస్తే హోటళ్లు, దుకాణాలను ఆశ్రయించాల్సిందే. గౌరారం స్టేజీ వద్ద వందలాది మంది ప్రయాణికులు రోజూ రాకపోకలు సాగిస్తుంటారు. చూసేందుకు పెద్ద రోడ్డు ఉన్నా, బస్సు కోసం నిలబడేందుకు కనీసం నీడ కూడా లేదు. అధికారులు స్పందించి ఇక్కడ తక్షణమే బస్టాండ్‌ను ఏర్పాటు చేయాలి" అని ప్రయాణికులు కోరుతున్నారు.

ప్రభుత్వ ఆశయాలకు విరుద్ధంగా, అధికారుల చోద్యం వల్ల నిధులు వృథా కావడమే కాకుండా.. సామాన్య ప్రయాణికులు అవస్థలు పడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, వర్గల్ ప్రయాణ ప్రాంగణాన్ని వినియోగంలోకి తెచ్చి, గౌరారంలో బస్టాండ్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story