ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. మహిళ అరెస్ట్

by Batti.Sumithra |

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వందలాది మంది నిరుద్యోగులను మోసం చేసిన ముఠాలో కీలక సభ్యురాలైన హైదరాబాద్‌కు చెందిన సుజాత ఠాకూర్‌ను ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. మహిళ అరెస్ట్
X

దిశ, ఆదిలాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వందలాది మంది నిరుద్యోగులను మోసం చేసిన ముఠాలో కీలక సభ్యురాలైన హైదరాబాద్‌కు చెందిన సుజాత ఠాకూర్‌ను ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ ముఠాపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 20కి పైగా కేసులు నమోదైనట్లు వెల్లడించారు. అనంత ఈ సొల్యూషన్స్, విద్యాదాన్ ఆర్గనైజేషన్ పేర్లతో నకిలీ నియామకాలు చేపడుతూ ప్రభుత్వ అనుమతులు ఉన్నట్లు నమ్మించి నిరుద్యోగులను మోసం చేసినట్లు విచారణలో తేలిందన్నారు.

ఈ ముఠా సభ్యులు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో అభ్యర్థి వద్ద రూ.1 లక్ష నుంచి రూ.2.5 లక్షల వరకు వసూలు చేసి సుమారు 240 మంది అభ్యర్థులను మోసం చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులను ఈ ఏడాది జనవరి 10న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని, తాజాగా పరారీలో ఉన్న సుజాత ఠాకూర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడే వారి మాటలను నమ్మవద్దని, ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం నిబంధనల ప్రకారమే లభిస్తాయని పేర్కొన్నారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు సూచించారు.

Next Story