మైనర్ బాలికపై అఘాయిత్యం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

by Kodari Anjali |

ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికను మోసగించి, పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడిన నిందితుడికి నాంపల్లి కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.

మైనర్ బాలికపై అఘాయిత్యం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, సికింద్రాబాద్: ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికను మోసగించి, పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడిన నిందితుడికి నాంపల్లి కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అదనంగా రూ.16 వేల జరిమానా కూడా విధిస్తూ అదనపు సెషన్స్ జడ్జి ఎం. అర్చన కుమారి తీర్పు వెలువరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చందానగర్ ప్రాంతానికి చెందిన గుమ్ముల నాగరాజు (19) అనే యువకుడు 16 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చగా గర్భస్రావం చేయించుకోవాలని ఒత్తిడి చేసినట్లు దర్యాప్తులో తేలింది.

కఠిన కారాగార శిక్షతో పాటు...

అంతేకాకుండా 2019 మార్చి 2న బాలికను బలవంతంగా బయటకు తీసుకెళ్లి తీవ్రంగా వేధించడంతో పాటు నగ్న ఫోటోలు, వీడియోలు తీసి బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మార్చి 7న మరోసారి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు గాంధీనగర్ పోలీసులు పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి చైతన్యపురి ఏసీపీ సీహెచ్. శ్రీధర్ పర్యవేక్షణలో, దర్యాప్తు అధికారులు కేసును లోతుగా విచారించి పక్కా ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.16 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి బాధితురాలికి న్యాయం చేకూర్చిన దర్యాప్తు అధికారులు, కోర్టు సిబ్బంది, పోలీసు అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు.

Next Story