ధర్మారం మండలంలో రవాణా శాఖ తనిఖీలు

by Ratna Kumari |

ధర్మారంలో ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న నాలుగు లారీలను రవాణా శాఖ సీజ్ చేసింది. ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై చర్యలు తప్పవని హెచ్చరించింది.

ధర్మారం మండలంలో రవాణా శాఖ తనిఖీలు
X

దిశ, ధర్మారం : ధర్మారం మండలంలో రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ఓవర్‌లోడ్‌తో మట్టిని తరలిస్తున్న నాలుగు లారీలపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు. మండలంలోని ఎర్రగుంటపల్లి శివారులో తనిఖీలు నిర్వహించిన అధికారులు, మట్టిని పరిమితికి మించి లోడ్ చేసుకుని వెళ్తున్న నాలుగు లారీలను గుర్తించారు. వాహనాలకు ఉన్న అనుమతులను పరిశీలించగా, నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో రవాణా చేస్తున్నట్లు తేలడంతో కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ హరిత యాదవ్ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఓవర్‌లోడ్ వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రవాణా శాఖ జారీ చేసిన అనుమతులకు లోబడి మాత్రమే వాహనాలను నడపాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మండలంలో మట్టి అక్రమ రవాణాపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, మైనింగ్ శాఖ అనుమతులకు మించి మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే స్కూల్ బస్సుల యజమానులు అన్ని అనుమతులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా కలిగి ఉండాలని, ప్రతి బస్సులో డ్రైవర్‌తో పాటు ఒక అటెండర్‌ను నియమించాలని సూచించారు. ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మరో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రియాజ్‌తో పాటు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story