వినోదం కోసం పులికి వేధింపులు! కొంతమంది సందర్శకుల అత్యుత్సాహం వైరల్

by Ramesh Naini |

గుజరాత్‌లోని జునాగఢ్‌లో గల ప్రసిద్ధ సక్కర్‌బాగ్‌ జూలో కొంతమంది సందర్శకుల అత్యుత్సాహం తీవ్ర వివాదాస్పదమైంది.

వినోదం కోసం పులికి వేధింపులు! కొంతమంది సందర్శకుల అత్యుత్సాహం వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్‌లోని జునాగఢ్‌లో గల ప్రసిద్ధ సక్కర్‌బాగ్‌ జూలో (Sakkarbaug Zoo) కొంతమంది సందర్శకుల అత్యుత్సాహం తీవ్ర వివాదాస్పదమైంది. బోనులో ఉన్న పులుల ఎన్‌క్లోజర్‌లోకి ఓ వస్త్రాన్ని విసిరి, వాటిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, జూ అధికారుల భద్రతా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఘటనలో ఏముందంటే?

ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా వీడియో బయటకు రావడంతో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో.. ఓ వ్యక్తి పులుల ఎన్‌క్లోజర్‌ వద్ద గుడ్డను విసరగా, ఓ పులి దానితో ఆడుకోవడం, మరో పులి ఆ గుడ్డను నమలడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అక్కడున్న మిగతా సందర్శకులు వారిని వారిస్తున్నట్లు కాకుండా, కేకలు వేస్తూ మరింత ప్రోత్సహించడం గమనార్హం. సాధారణంగా అటవీ ప్రాంతాలకు దగ్గర్లోని గ్రామాల్లో వన్యప్రాణులపై వేధింపులు జరగడం చూస్తుంటామని, కానీ జంతువులకు పూర్తి భద్రత ఉండాల్సిన జూలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యమేనని జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.

అధికారుల వివరణ..

ఈ ఘటనపై సక్కర్‌బాగ్ జూ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (DCF) రాజ్‌దీప్ సిన్హ్ ఝాలా స్పందించారు. ‘మా సిబ్బంది చిరుతపులుల బోనుల వద్దకు వెళ్లిన కొద్ది సమయంలోనే ఈ ఘటన జరిగింది. సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. వన్యప్రాణులను వేధించడం చట్టవిరుద్ధం. పోలీసుల సాయంతో బాధ్యులను గుర్తించి, వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు.

Next Story