HMDA సీఈ రవీందర్‍పై ఏసీబీ సోదాల్లో విస్తుపోయే ఆస్తులు వివరాలు

by Prasad Jukanti |

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండీఏ సీఈ బచ్చు రవీందర్ నివాసాలపై ఏసీబీ మెరుపు దాడులు నిర్వహించింది.

HMDA సీఈ రవీందర్‍పై ఏసీబీ సోదాల్లో విస్తుపోయే ఆస్తులు వివరాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో అవినీతి తిమింగలాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) మరోసారి ఉక్కుపాదం మోపింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) చీఫ్ ఇంజినీర్ (CE) బచ్చు రవీందర్ నివాసం, ఆయన బంధువుల ఇళ్లపై ఇవాళ ఏసీబీ అధికారులు ఇవాళ మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో విస్తుపోయే నిజాలు, ఊహించని స్థాయిలో అక్రమ ఆస్తులు వెలుగుచూశాయి. గచ్చిబౌలిలోని ప్రముఖ సుమధుర టవర్స్ లోని రవీందర్ ప్రధాన నివాసంతో పాటు హైదరాబాద్, నిజామాబాద్‌ జిల్లాల్లోని మొత్తం 10 ప్రాంతాలలో ఏసీబీ బృందాలు ఒకేసారి రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టాయి.

భారీగా స్థిరాస్తులు:

ఈ సోదాలపై ఏసీబీ డీఎస్పీ మాజిద్ స్పందిస్తూ.. బచ్చు రవీందర్ సంపాదించిన భారీ స్థిరాస్తుల చిట్టాను ఆయన వివరించారు. మసీద్ బండ ప్రాంతంలో ఒక విలాసవంతమైన 4 అంతస్తుల భవనం, కొండాపూర్ వంటి ఖరీదైన ఏరియాలో 2 లగ్జరీ ఫ్లాట్లతో పాటు హైదరాబాద్‌లోని పలు ఇతర ప్రాంతాలలో ఇళ్లు ఉన్నట్లు అధికారులు నిర్ధరించారు. శంకర్ పల్లి, కిష్టాపూర్ పరిధిలో భారీగా భూములు ఉన్నట్లు కనుగొన్నారు. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్‌ పరిధిలో 4 ఎకరాల ఖరీదైన భూమిని, జడ్చర్లలో 7 ఓపెన్ ప్లాట్లను గుర్తించారు. అయితే లభించిన పత్రాలను బట్టి ఆస్తుల విలువ మార్కెట్ ధర ప్రకారం మరిన్ని కోట్ల రూపాయలలో ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.

అరకిలో బంగారం:

స్థిరాస్తులతో పాటు ఆయన నివాసంలో సోదాలు చేసిన అధికారులకు పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు లభ్యమయ్యాయి. రవీందర్ ఇంట్లో అర కిలోకి పైగా బంగారం, ఒక కిలో వెండితో పాటు రూ. 4 లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story