గోల్కొండ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు పగడ్బందీగా చేయండి.. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్

by Kodari Anjali |

అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు

గోల్కొండ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు పగడ్బందీగా చేయండి.. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: గోల్కొండ బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. ప్రభుత్వం బోనాల ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున ఏర్పాట్లు ఆ దిశగా ఉండాలని సూచించారు. గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయం వద్ద బోనాల ఉత్సవాల ఏర్పాట్లను మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోట పరిసరాల్లో కాలినడకన పర్యటిస్తూ భక్తుల రాకపోకలు, క్యూలైన్లు, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా, భద్రత తదితర ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గురువారం తొలి పూజతో తొలి బోనం ఊరేగింపు, మంత్రులు, ప్రముఖులచే పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమాలు జరుగనున్నాయని, అనంతరం ఆగస్టు 13వ తేదీ వరకు ప్రతి గురువారం, ఆదివారం బోనాల ఉత్సవాలు కొనసాగనున్న నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

వైరింగ్‌ను ముందుగానే క్షుణ్ణంగా తనిఖీ చేసి..

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాల్లో పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, క్యూలైన్ల నిర్వహణతో పాటు అవసరమైన స్టేజింగ్ ఏర్పాట్లు చేపట్టాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన ప్రాంతాల్లో బయో టాయిలెట్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులో ఉంచాలని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ లైన్లు, వైరింగ్‌ను ముందుగానే క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపాలను సరిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సీసీ కెమెరాల నిఘాను పటిష్టం చేయాలని, షీ టీమ్స్‌ను మోహరించడంతో పాటు అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్డీఓ రామకృష్ణ, గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫియాజ్, విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ కరుణాకర్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వినోద్, గోల్కొండ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, దేవాలయ ఈఓ వసంత, పురావస్తు పరిరక్షణ అధికారి మల్లేష్, జీహెచ్ఎంసీ, జలమండలి, టీజీఎస్పీడీసీఎల్, ఆర్ అండ్ బీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story