India-China: ఈ ఏడాది ప్రథమార్థంలో చైనా నుంచి దిగుమతులు 21 శాతం పెరిగాయ్

by S Gopi |

భారత ఎగుమతులు మంచి వృద్ధి నమోదు చేసినప్పటికీ, చైనా నుంచి దిగుమతులు భారీగా పెరగడంతో వాణిజ్య లోటు 67.1 బిలియన్ డాలర్ల(రూ. 6.44 లక్షల కోట్ల)కు చేరింది.

India-China: ఈ ఏడాది ప్రథమార్థంలో చైనా నుంచి దిగుమతులు 21 శాతం పెరిగాయ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: చైనాతో భారత్ వాణిజ్యం వేగంగా పెరుగుతున్నప్పటికీ, వాణిజ్య లోటు కూడా అదే స్థాయిలో విస్తరిస్తోంది. చైనా కస్టమ్స్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2026 తొలి ఆరు నెలల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 23.6 శాతం పెరిగి 91.72 బిలియన్ డాలర్ల(రూ. 8.81 లక్షల కోట్ల)కు చేరింది. ఇదే సమయంలో భారత్‌కు చైనా ఎగుమతులు 21.8 శాతం పెరిగి 79.41 బిలియన్ డాలర్ల(రూ. 7.63 లక్షల కోట్ల)కు చేరగా, చైనాకు భారత ఎగుమతులు 37.2 శాతం పెరిగి 12.31 బిలియన్ డాలర్లు(రూ. 1.18 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. భారత ఎగుమతులు మంచి వృద్ధి నమోదు చేసినప్పటికీ, చైనా నుంచి దిగుమతులు భారీగా పెరగడంతో వాణిజ్య లోటు 67.1 బిలియన్ డాలర్ల(రూ. 6.44 లక్షల కోట్ల)కు చేరింది. టెలికాం పరికరాలు, సెమీకండక్టర్లు, స్మార్ట్‌ఫోన్ విడిభాగాలు, లిథియం-అయాన్ బ్యాటరీలు, పారిశ్రామిక యంత్రాలు, రసాయనాలు, ప్లాస్టిక్స్ వంటి ఉత్పత్తులు భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుండగా, ఖనిజాలు, శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు, ఆర్గానిక్ రసాయనాలు, వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులు, ఔషధాలు, రత్నాలు వంటి వస్తువులను చైనాకు ఎగుమతి చేస్తోంది. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, ఓఎల్ఈడీ డిస్‌ప్లే మాడ్యూల్స్, లైట్ నాఫ్తా వంటి ఉత్పత్తుల ఎగుమతులు వేగంగా పెరగడం విశేషం.

అయితే వాణిజ్య సమతుల్యత ఇప్పటికీ భారత్‌కు పెద్ద సవాలుగానే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో చైనాతో వాణిజ్య లోటు 112.6 బిలియన్ డాలర్ల(రూ. 10.81 లక్షల కోట్ల) రికార్డు స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఐటీ, ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల వంటి రంగాల్లో చైనా మార్కెట్‌ను మరింతగా తెరవాలని భారత్ కోరుతోంది. భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి కూడా చైనా మరిన్ని భారత ఔషధాలు, ఇతర పోటీ పడే ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం, అలాగే దేశంలో చైనా పెట్టుబడులు పెరగడం రెండు దేశాల ఆర్థిక సంబంధాలకు మేలు చేస్తుందని అన్నారు. ఇటీవలి నెలల్లో చైనా పెట్టుబడులపై విధానపరమైన సడలింపులు ప్రారంభమైన నేపథ్యంలో, మార్కెట్ యాక్సెస్, పెట్టుబడులు, వాణిజ్య అసమతుల్యత వంటి నిర్మాణాత్మక సమస్యల పరిష్కారంపై ఇరు దేశాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Next Story