అర్హులందరికీ పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

by Batti.Sumithra |

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని బాన్సువాడ డీఎల్‌పీఓ ప్రసాద్‌రావు అన్నారు.

అర్హులందరికీ పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
X

దిశ, నిజాంసాగర్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని బాన్సువాడ డీఎల్‌పీఓ ప్రసాద్‌రావు అన్నారు. మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహాల పథకం కింద మంగళవారం లబ్ధిదారులకు ఇంటి మంజూరు ప్రొసీడింగ్స్‌ను బాన్సువాడ డీఎల్‌పీఓ ప్రసాద్‌రావు, గ్రామ సర్పంచ్ బోయిని హరిన్‌కుమార్ కలిసి లబ్ధిదారులు చాకలి నాగమణి, పశమల అరుణలకు మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా డీఎల్‌పీఓ ప్రసాద్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పూర్తిస్థాయి పారదర్శకతతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహిస్తూ నిర్మాణ పనులకు అవసరమైన సూచనలు అందిస్తారని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి లబ్ధిదారు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామ సర్పంచ్ బోయిని హరిన్‌కుమార్ మాట్లాడుతూ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషితో హసన్‌పల్లి గ్రామానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం చేరుతున్నాయని అన్నారు.

ఇందిరమ్మ గృహాల పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతోందని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధితో పాటు ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా గ్రామపంచాయతీ తరఫున నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. అనంతరం డీఎల్‌పీఓ ప్రసాద్‌రావు గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు. నిర్మాణాలను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని సంబంధితులకు సూచించారు. అలాగే గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని, ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పాఠశాల పరిసరాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి శిరీష, నాయకులు సాయిలు, బోయిని విట్టల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story