- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రేటర్ లో నకి’లీలలు..
గ్రేటర్ హైదరాబాద్లో పేరొందిన కంపెనీ ఉత్పత్తులను పోలిన నకిలీ ఉత్పత్తులను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు.

దిశ, హైదరాబాద్ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో పేరొందిన కంపెనీ ఉత్పత్తులను పోలిన నకిలీ ఉత్పత్తులను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. టీ పొడి, నెయ్యి, పాలు, నూనెలు, కిరాణా వస్తువులు, పప్పు దినుసులు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, విద్యుత్ పరికరాలు, టీవీలు, కంప్యూటర్లు, మిక్సీలు, గ్రైండర్లు ఇలా ఒక్కటేమిటీ అన్ని రకాల నిత్యావసరాలను అచ్చు గుద్దినట్లు అసలును పోలిన నకిలీ వస్తువులను తయారీ చేసి అమ్ముతూ ప్రజలను నిలువుదోపిడి చేస్తున్నారు. పెద్ద కంపెనీల లేబుళ్లను ఎలాంటి అనుమతులు లేకుండా ఇల్లీగల్ గా తాము తయారు చేసిన వస్తువులకు వేసి బహిరంగంగా అమ్ముతున్నారు. ఇది తెలియని కొనుగోలుదారులు అవే ఒరిజినల్ అనుకుని కొని దారుణంగా మోసపోతున్నారు. ఇలాంటి అమ్మకాలకు ప్రముఖ వ్యాపార కేంద్రాలైన బేగంబజార్, ట్రూప్ బజార్, మహరాజ్ గంజ్, బ్యాంక్ స్ట్రీట్, గుజరాతీగల్లీ, రాణిగంజ్, జాంబాగ్ మార్కెట్లు అడ్డాలుగా మారుతున్నాయి. దాడులు చేసి డుప్లికేట్ అమ్మకం దార్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు సైతం వినబడుతున్నాయి. ఎప్పుడో ఒకసారి తూతూ మంత్రంగా దాడులు చేస్తూ చేతులు దులుపుకుంటుండడంతో నకిలీల బెడద తప్పడం లేదని సాధారణ ప్రజలు మండిపడుతున్నారు .
హోల్ సేల్ మార్కెట్లలో అడ్డగోలుగా విక్రయాలు...?
బేగంబజార్, మహరాజ్ గంజ్ మార్కెట్లకు అన్ని రకాల వస్తువులు విక్రయించే హోల్ సేల్ మార్కెట్లుగా గుర్తింపు పొందాయి. ఇక్కడ పెద్ద సంఖ్యలో హోల్ సేల్ దుకాణాలు ఉండగా జంటనగరాలతో పాటు జిల్లాల నుండి కూడా కొనుగోలు కోసం వస్తుంటారు. ప్రతినిత్యం కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయే మార్కెట్ల లో నిత్యం కోట్లాది రూపాయల విక్రయాలు జరుగుతుంటాయి. ఇంతటి పేరున్న మార్కెట్ల పై అధికారులు దాడులు మరచిపోవడంతో నిర్వాహకులు నకిలీ వస్తువుల విక్రయాలకు తెరలేపారు . ఈ నేపథ్యంలో అధికారులకు అందిన ఫిర్యాదులతో గతంలో మార్కెట్ లోని కొన్ని హోల్ సేల్ దుకాణాలపై దాడులు చేయగా, విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. లక్షలాధి రూపాయల నకిలీ గృహాపకరణాలు పట్టుబడడంతో అధికారులు సైతం షాక్ తిన్నారు.
నిలువు దోపిడి...?
నకిలీ వస్తువులు విక్రయించే వ్యాపారులు ప్రజలను నిలువు దోపిడి చేస్తున్నారు. పేరొందిన ఏ కంపెనీ బ్రాండ్ ల పేరుతోనైనా నకిలీవి తయారు చేసి విక్రయించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య ముఖ్యంగా బ్రాండ్ యజమాని అనుమతి లేకుండా చట్టవిరుద్ధంగా తయారు చేస్తూ నిత్యం లక్షలాది రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కంపెనీలు తయారు చేసిన అసలు వస్తువుల మాధిరిగానే పేర్లు, లేబుల్స్ ఉంటుండడంతో కొనుగోలుదారులు వీటిని చూసి బోల్తా పడుతున్నారు. దీనికి తోడు నకిలీ వస్తువుల తయారీ, విక్రయదారులు డిస్కౌంట్లు, ఆఫర్లు అంటూ మభ్యపెడుతూ బహింరంగ విక్రయాలు చేపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నగరంలోని పేరొందిన మార్కెట్లలోని హోల్ సేల్ దుకాణాలపై తరచుగా దాడులు చేసి నకిలీ ప్రొడక్ట్స్ అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలను నగర ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.






