పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

by Ratna Kumari |

రాష్ట్ర చరిత్రలో ఒకే చోట 2,160 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి పేదలకు అందిస్తున్నామని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల, భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
X

దిశ, హుజూర్ నగర్ టౌన్ : రాష్ట్ర చరిత్రలో ఒకే చోట 2,160 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి పేదలకు అందిస్తున్నామని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల, భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాలలో రూ.125 కోట్లతో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇండ్ల ప్లాట్ల మోడల్ కాలనీలో రూ.20 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్, అంగన్ వాడి భవనం, కమ్యూనిటీ హాల్, సి‌సి రోడ్లు, డ్రైన్స్ , వీధి లైట్లు, పిల్లల ఆట స్థలం, షాపింగ్ కాంప్లెక్స్, ఆర్చ్ లకు శంఖుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. హుజూర్ నగర్ నియోజకవర్గంలో నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, రైస్ మిల్లులో పనిచేసే వారికి ఆశ్రయం కల్పించాలన్న లక్ష్యంతో 110 ఎకరాల దేవాలయ భూములను మార్కెట్ రేటుకి కొనుగోలు చేసి పనులు ప్రారంభించడం జరిగిందని, రాష్ట్ర విభజన తర్వాత గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపివేసినదని, తిరిగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 14 సంవత్సరాల నా పట్టుదల, కృషి, ఆకాంక్షలతో తిరిగి పనులను ప్రారంభించి ప్రాజెక్టును పూర్తిచేసి పేద ప్రజలకు అందించడం నా చిరకాల స్వప్నం అని, దీనిని నా అదృష్టంగా భావిస్తున్నానని, రూ.75 కోట్లతో అంతర్గత రోడ్లు, ఎలక్ట్రిసిటీ, త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ కొరకు ప్రభుత్వం నుండి మంజూరు చేయించి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించినట్లు వెల్లడించారు.

ఇందులో 10 కోట్లతో 32 వేల స్క్వేర్ ఫీట్ సైజ్ లో తెలంగాణ మోడల్ పబ్లిక్ బోర్డింగ్ స్కూల్ నిర్మాణం చేపట్టమన్నారు. ఇందులో 2,500 మంది హౌసింగ్ కాలనీ, హుజూర్ నగర్ లోకల్ పేద విద్యార్థులు చదువుకోడానికి వీలుంటుందని పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లోనే విద్యాభ్యాసం ఉంటుందని మంత్రి అన్నారు. కాలనీలో గ్రీనరీ పెంచాలని అలాగే జిల్లాలోని హౌసింగ్ సిబ్బందితో ప్రతి ప్లాటు క్షుణ్ణంగా చెక్ చేసి, అన్ని పనులు పూర్తి అయినవో, ఇంకా ఏమైనా పెండింగ్లో ఉన్నాయో నివేదిక అందించాలని కలెక్టర్ కు సూచించారు. ఒకే ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన ఇద్దరు పిల్లలు ఉంటే వారికి అదనంగా ఇంకో ప్లాటు మంజూరు చేయాలని, బాత్రూం, టాయిలెట్స్ చిన్నవిగా ఉన్నందువలన ఎవరైనా అతిథులు వస్తే ఇబ్బందికరంగా ఉంటుంది.

కావున కాలనీలో బయట వైపు అదనంగా టాయిలెట్స్, బాత్రూమ్స్ మున్సిపాలిటీ వారితో నిర్మించి, వారికే మెయింటినెన్స్ అప్పగించాలని, ప్రతి హౌసింగ్ బ్లాక్ కి మూడు రంగులు స్పష్టంగా కనబడే విధంగా మరొక కోటింగ్ వేయించాలని, ఇందిరమ్మ హౌసింగ్ కాలనీలోకి ప్రవేశించటానికి ప్రస్తుతం ఒకే రోడ్డు ఉన్నదని అదనముగా మరొక రోడ్డును కూడ వేయించడం జరుగుతుందని తెలిపారు. మోడల్ హౌసింగ్ కాలనీ అంటే మోడల్ గా క్వాలిటీ బ్రహ్మాండంగా ఉండాలని, అర్హులకు మాత్రమే ఇండ్లు మంజూరు చేయాలని, అర్హత లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండ్లు మంజూరు చేయకూడదని ఎంపిక విషయంలో ఎలాంటి అవినీతికి, అవకతవకలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించిన తర్వాత జనాభాను బట్టి వార్డులుగా విభజించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ దొంతగాని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాధికా, హుజూర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, తాసిల్దార్ కవిత, డీఎస్ఓ మోహన్ బాబు, హార్టికల్చర్ అధికారి నాగయ్య, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story