ఫారెస్టు అకాడమీలో 12వ బ్యాచ్ ఎఫ్ఆర్ఓల ట్రైనింగ్ షురూ

by Malleboina Mahesh |

దూలపల్లిలో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ (టీఎస్‌ఎఫ్‌ఏ) 12వ బ్యాచ్ అటవీ క్షేత్రస్థాయి అధికారుల (ఎఫ్‌ఆర్‌వో) ప్రవేశ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.

ఫారెస్టు అకాడమీలో 12వ బ్యాచ్ ఎఫ్ఆర్ఓల ట్రైనింగ్ షురూ
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిజాయితీ, వృత్తి నైపుణ్యమే ఫారెస్టు అధికారులకు గుర్తింపు తెస్తుందని పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ అన్నారు. దూలపల్లిలో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ (టీఎస్‌ఎఫ్‌ఏ) 12వ బ్యాచ్ అటవీ క్షేత్రస్థాయి అధికారుల (ఎఫ్‌ఆర్‌వో) ప్రవేశ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. 18 నెలల పాటు కొనసాగే ఈ శిక్షణ కార్యక్రమంలో ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు చెందిన 58 మంది శిక్షణార్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారిణి (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌) డాక్టర్ సి. సువర్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ నిర్వహణ, జీవవైవిధ్య పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ తో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా భవిష్యత్ అటవీ అధికారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అటవీ అధికారులు దేశ అటవీ సంపదకు, సహజ వనరులకు తొలి కాపలాదారులని పేర్కొన్నారు.

భవిష్యత్ తరాలకు ప్రకృతి సంపదను అందించడంలో అటవీ అధికారుల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. తమ విధుల్లో నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యం, ప్రజాసేవా దృక్పథం ప్రతిబింబించాలని శిక్షణార్థులకు సూచించారు. అటవీ సంరక్షణ మాత్రమే కాకుండా జీవవైవిధ్య పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ చట్టాల అమలు, పర్యావరణ పరిరక్షణ, స్థానిక సమాజాలతో సమన్వయం వంటి బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. అటవీ రంగంలో వస్తున్న కొత్త సవాళ్లను ఎదుర్కోవాలంటే నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. దేశంలో అటవీ సంపద పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత కాపాడడంలో శిక్షణ పొందిన, అంకితభావం కలిగిన అధికారులు కీలక పాత్ర పోషిస్తారని ఆమె తెలిపారు.

తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ప్రియాంకా వర్గీస్ మాట్లాడుతూ స్థానిక ప్రజల అవసరాలను అర్థం చేసుకుంటూ అటవీ సంరక్షణలో ముందుండే సమర్థ అధికారులను తీర్చిదిద్దడమే అకాడమీ లక్ష్యమని చెప్పారు. 18 నెలల శిక్షణ కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని అటవీ వ్యవస్థలు, జీవవైవిద్యం, క్షేత్రస్థాయి పరిపాలన, సంరక్షణ పద్ధతులపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని శిక్షణార్థులకు సూచించారు. నేటి అటవీ పరిపాలనలో శాస్త్రీయ పరిజ్ఞానం, క్షేత్రస్థాయి అనుభవం, నాయకత్వ లక్షణాలు, ప్రజలతో సమన్వయం ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు సాంకేతికత, ఆవిష్కరణలను స్వీకరించి పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పని చేయాలని సూచించారు. ఈ శిక్షణ ద్వారా ఆధునిక కాలంలో అటవీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే నైపుణ్యాలు పెంపొందుతాయని ఆమె తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అటవీ పరిపాలన, అటవీ నిర్వహణ, వన్యప్రాణి సంరక్షణ, అటవీ నేరాల నివారణ, జీవవైవిధ్య పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, స్థానికంగా నివసించే వర్గాల ఆధారిత అటవీ నిర్వహణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలపై విస్తృతంగా శిక్షణ అందించానున్నామని తెలిపారు.

అటవీ సంపద సంరక్షణతో పాటు అటవీ ప్రాంతాల పై ఆధారపడే ప్రజల అవసరాలను సమన్వయం చేసుకుంటూ పనిచేసే సమర్థ అధికారులను తయారు చేయడమే దీని ఉద్దేశమని తెలిపారు. ప్రధాన అటవీ సంరక్షణాధికారి (పరిపాలన) డాక్టర్ ఎస్.జె. ఆశా కూడా శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అటవీ సేవల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన విధి నిర్వహణ ప్రాధాన్యంపై ఆమె పలు సూచనలు చేశారు. అనంతరం శిక్షణార్థులు, సీనియర్ అటవీ అధికారుల మధ్య పరస్పర చర్చా కార్యక్రమం నిర్వహించారు. అటవీ సేవల్లో ఉన్న అవకాశాలు, బాధ్యతలు, సవాళ్లపై అధికారులు శిక్షణార్థులకు అవగాహన కల్పించారు. శిక్షణ పూర్తయిన అనంతరం శిక్షణార్థులు తమ తమ రాష్ట్రాల్లోని వివిధ అటవీ విభాగాల్లో విధులు నిర్వహించనున్నారు. అటవీ సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, వన్యప్రాణి నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో వారు కీలక పాత్ర పోషించనున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్, కోర్స్ డైరెక్టర్ జి.బి. రేఖాభాను, అదనపు కోర్స్ డైరెక్టర్ సాహు, అసిస్టెంట్ కోర్స్ డైరెక్టర్ భూమా కున్వర్, అధ్యాపకులు, అకాడమీ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story