టీజీ20 లీగ్‌ను తక్షణమే నిలిపివేయాలని హైకోర్టు పిటిషన్

by Malleboina Mahesh |

టీజీ20 లీగ్‌ను వెంటనే నిలిపివేయాలంటూ హైకోర్టులో క్రికెటర్ల పిటిషన్.. అంబటి రాయుడు తమను మోసం చేశారంటూ సంచలన ఆరోపణలు!

టీజీ20 లీగ్‌ను తక్షణమే నిలిపివేయాలని హైకోర్టు పిటిషన్
X

దిశ,తెలంగాణ బ్యూరో: అవినీతి ఆరోపణలు, సీఐడీ విచారణ ఆదేశాలతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెచ్‌సీఏ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్‌ వ్యవహారం ఇప్పుడు ఉన్నత న్యాయ స్థానానికి చేరింది. ఈ లీగ్‌కు ఎలాంటి చట్టబద్ధత లేదని, వెంటనే దానిని నిలిపివేయాలని కోరుతూ తెలంగాణకు చెందిన పలువురు క్రికెటర్లు శుక్రవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్‌లో టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్‌తో పాటు ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడిపై క్రీడాకారులు తీవ్రస్థాయిలో మోసపూరిత ఆరోపణలు చేయడం క్రీడా వర్గాల్లో సంచలనంగా మారింది.

క్రీడాకారుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు

హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆటగాళ్లు పలు కీలక అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. హెచ్‌సీఏ అనధికారికంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్‌కు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం గానీ, చట్టపరమైన గుర్తింపు గానీ లేదని వారు స్పష్టం చేశారు. ఎలాంటి అనుమతులు, నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ఈ లీగ్‌కు చట్టబద్ధత లేదని ఇల్లీగల్ అని తక్షణమే ప్రకటించాలని కోరారు. చట్టబద్ధత లేని లీగ్ పేరుతో క్రీడాకారుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని, అందువల్ల ప్రస్తుతం కొనసాగుతున్న టీజీ20 లీగ్ మ్యాచ్‌లను తక్షణమే నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు.

తమను అంబటి రాయుడు నిలువునా మోసం చేశారు

ఈ వ్యవహారంలో టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్‌ తీరుతో పాటు మాజీ అంతర్జాతీయ క్రికెటర్ అంబటి రాయుడు పాత్రపై క్రీడాకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లీగ్ నిర్వహణ, ఆటగాళ్ల ఎంపిక, ఇతర నిబంధనల విషయంలో టీజీ 20 గవర్నింగ్ కౌన్సిల్ అందులో కీలక పాత్ర పోషిస్తున్న అంబటి రాయుడు తమను నిలువునా మోసం చేశారని పిటిషన్‌లో ఆరోపించారు. పారదర్శకత లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, మాయమాటలతో తమ క్రీడా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాకారులను మోసగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story