- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగా ఫుడ్ పార్కును ప్రైవేటు సంస్ధలకు కట్టబెట్టే కుట్రలు: పొంగులేటి సుధాకర్‌రెడ్డి
బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ భూములను ప్రైవేటు సంస్థకు కట్టబెడుతున్నారు.. సింగరేణిలో 4 మిలియన్ టన్నుల బొగ్గు మాయం: పొంగులేటి సుధాకర్ రెడ్డి ధ్వజం.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం మెగా ఫుడ్ పార్క్ ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలకు, ప్రైవేటు సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టే కుట్రలకు కేంద్రంగా మార్చిందని బీజేపీ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఏకంగా 72 ఎకరాల విస్తీర్ణమైన విలువైన భూమిని గుట్టుచప్పుడు కాకుండా దీపక్ నెక్స్ట్ జెన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు తెరవెనుక పక్కా స్కెచ్ వేసిందన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందాలని కేంద్రం మంజూరు చేసిన కోట్లాది రూపాయల నిధులను, ప్రాజెక్టు అసలు లక్ష్యాలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని విరుచుక పడ్డారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఫుడ్ పార్క్ భూ కేటాయింపుల్లో చోటుచేసుకున్న పారదర్శకత లేని చీకటి ఒప్పందాలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. వేలాది మంది యువతకు ఉపాధి కల్పించాల్సిన ఈ ప్రాజెక్టు కార్పొరేట్ సంస్థల జేబులు నింపే సాధనంగా మారిపోయిందని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సీబీఐ, కేంద్ర విజిలెన్స్ కమిషన్ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లాజిస్టిక్స్, కోల్డ్ చైన్ వ్యవస్థలతో కూడిన ప్రపంచ స్థాయి వ్యవసాయ మౌలిక సదుపాయాలను నిర్మించాలనే లక్ష్యంతో బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సుమారు రూ.109.59 కోట్ల భారీ అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కోసం, కేంద్రం రూ. 49.79 కోట్ల నిధులను గ్రాంట్ రూపంలో విడుదల చేసింది.
స్థానిక రైతుల నుంచి సుమారు 200 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. రైతుల త్యాగాల పునాదుల మీద నిర్మితమవుతున్న ఈ ఫుడ్ పార్క్ భూములపై ఇప్పుడు బడా బాబుల కన్ను పడింది. బహిరంగ మార్కెట్‌లో ఎకరం భూమి ధర రూ.70 నుంచి 80 లక్షల వరకు పలుకుతుండగా, కేవలం రూ. 21 లక్షలకు అతి తక్కువ ధరకే ఆ ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.ఈ వివాదాస్పద టెండర్‌ను రద్దు చేయాలని, ప్రాజెక్టు అమలులో కేంద్ర మార్గదర్శకాలు ఎంతవరకు అమలవుతున్నాయో తెలుసుకునేందుకు తక్షణమే ఒక సమగ్ర నివేదికను తెప్పించుకోవాలని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను తన లేఖలో కోరినట్లు తెలిపారు.
సింగరేణి కాలరీస్ సంస్ధ అక్రమాలకు అడ్డగా మారింది
రాష్ట్రానికి గుండెకాయ లాంటి సింగరేణి కాలరీస్ సంస్థను సైతం అధికార ప్రభుత్వం అక్రమాలకు అడ్డాగా మార్చేసిందని నిప్పులు చెరిగారు. కృష్ణారం ప్రాంతంలో అత్యంత కీలకమైన సైలో బంకర్ నిర్మాణంలో కోల్‌కతా కంపెనీతో కుమ్మక్కై నాణ్యతను గాలికి వదిలేశారని విమర్శించారు. సింగరేణిలో ఏకంగా 4 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు మాయమైపోయాయని, 69.01 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా, అందులో కేవలం 65.23 మిలియన్ టన్నులు మాత్రమే రవాణా చేయబడిందన్నారు. మిగిలిన ఆ నాలుగు మిలియన్ టన్నుల బొగ్గును ఏ బడా నాయకులు మింగేశారో సీఎం రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలన్నారు.
సంస్థ కేటాయించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు కూడా పెద్ద ఎత్తున పక్కదారి పడుతున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా సాగుతున్న ఈ పచ్చి దోపిడీ, బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్‌లో భూ కేటాయింపుల బాగోతం, సింగరేణి బొగ్గు మాయం వ్యవహారాలపై వాస్తవాలను వివరిస్తూ తక్షణమే ఒక శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఉందా అని సవాలు విసిరారు. ప్రజల సొమ్మును కొల్లగొడుతున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధులు వాకధాని పుల్లారావు యాదవ్, నంబూరి రామలింగేశ్వరరావు పాల్గొన్నారు.






