- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాతృభాష పరిరక్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
ఆంగ్లంతో పాటు మాతృభాషను కాపాడటం ఉపాధ్యాయుల బాధ్యత.. గిరిజన ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు వేడుకలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపు!

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా ప్రోత్సహిస్తూనే, మాతృభాషను, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ విద్యాసంస్థల ఉపాధ్యాయుల కోసం ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 'రెండు వారాల ఆంగ్ల భాషా ప్రావీణ్యత శిక్షణ' కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని ముగింపు కార్యక్రమం శుక్రవారం లోక్ భవన్‌లో జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న 56 మంది ఉపాధ్యాయులకు గవర్నర్ ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మారుమూల గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరింత సమర్థవంతంగా బోధించాలనే ఉద్దేశంతోనే ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
ఆంగ్ల భాషా నైపుణ్యం పెరగడం వల్ల గిరిజన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, తద్వారా వారు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను మెరుగ్గా అందిపుచ్చుకుంటారని పేర్కొన్నారు. "శిక్షణ పొందిన ఉపాధ్యాయులు గిరిజన విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలి. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలి. గిరిజన సంక్షేమానికి సంబంధించి ఏ కార్యక్రమం చేపట్టినా లోక్ భవన్ పూర్తి మద్దతు ఇస్తుంది" అని గవర్నర్ స్పష్టం చేశారు. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి గవర్నర్ విచక్షణ నిధుల నుంచి రూ.12.80 లక్షలు లోక్ భవన్ మంజూరు చేసింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్, ఈఎఫ్ఎల్‌యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగరాజు, గవర్నర్ సంయుక్త కార్యదర్శి కె.శశికిరణా చారి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజా రామ్ తదితరులు పాల్గొన్నారు.






