- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాధాకిషన్‌రావు ఆస్తులపై విచారణ జరపాల్సిందే: చికోటి ప్రవీణ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరైన చికోటి ప్రవీణ్.. మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు అక్రమాస్తులపై దర్యాప్తు జరపాలని డిమాండ్!

దిశ,తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణ ముమ్మరం గా కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్టయిన నిందితులకు నార్కో అనాలసిస్ టెస్ట్ నిర్వహిస్తేనే ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు గుట్టు, తెరవెనుక పెద్దల పేర్లు బయటకొస్తాయని చికోటి ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి చికోటి ప్రవీణ్ సిట్ విచారణ శుక్రవారం ముగిసింది. బంజారాహిల్స్‌లోని సిట్ కార్యాలయంలో అధికారుల ఎదుట హాజరైన ఆయన.. ట్యాపింగ్ వ్యవహారంపై కీలక స్టేట్‌మెంట్ ఇచ్చారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
వాస్తవాలు వెలుగులోకి రావాలంటే నార్కోటెస్ట్ చేయాల్సిందే
గత ప్రభుత్వ హయాంలో తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని, తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారని ఆరోపిస్తూ చికోటి ప్రవీణ్ గతంలో డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగానే సిట్ అధికారులు తాజాగా ఆయనను విచారణకు పిలిచి స్టేట్‌మెంట్ నమోదు చేసుకున్నారు. రాధాకిషన్‌రావు తన పదవిని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారని చికోటి ఆరోపించారు. కేవలం తన ఫోన్ మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రెండు వేలకు పైగా ఫోన్లను ఆయన ఆధ్వర్యంలోనే ట్యాపింగ్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు ఆ సమాచారంతో ఎవరిని బ్లాక్‌మెయిల్ చేశారు ఏ మేరకు వసూళ్లకు పాల్పడ్డారన్న వాస్తవాలు వెలుగులోకి రావాలంటే నిందితులందరికీ నార్కో అనాలసిస్ పరీక్షలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
రాధాకిషన్‌రావు అక్రమాస్తులపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరపాలి
అధికార దుర్వినియోగానికి పాల్పడిన రాధాకిషన్‌రావు కూడబెట్టిన అక్రమాస్తులపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరపాలని చికోటి ప్రవీణ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఆయన ఆస్తులపై విచారణ చేయని పక్షంలో.. తాను నేరుగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని, ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తానని ఆయన హెచ్చరించారు. తన ఫోన్ సంభాషణలు వినడం ద్వారా తన వ్యాపార, వ్యక్తిగత వ్యవహారాలకు తీవ్ర ఆటంకం కలిగించే కుట్ర జరిగిందని ఆయన సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం.






