పందుల దొంగల హల్ చల్.. పోలీసుల ఛేజింగ్ అదుర్స్

by Muthe.Rajitha |

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలో గురువారం అర్ధరాత్రి పందుల దొంగలు సృష్టించిన హల్‌చల్ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పందుల దొంగల హల్ చల్.. పోలీసుల ఛేజింగ్ అదుర్స్
X

దిశ, వెబ్ డెస్క్ : జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలో గురువారం అర్ధరాత్రి పందుల దొంగతనం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో దాదాపు ఎనిమిది మంది గుర్తుతెలియని వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి, స్థానికంగా ఉన్న 36 పందులను దొంగిలించారు. అనంతరం వాటిని ఒక బొలెరో వాహనంలో ఎక్కించుకుని శాంతినగర్ వైపు వేగంగా పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ దొంగతనాన్ని గమనించిన పెంపకందారులు వెంటనే శాంతినగర్‌లోని తమ బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

అయితే, దొంగల బొలెరో వాహనం శాంతినగర్ స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా పంక్చర్ అయ్యింది. సరిగ్గా అదే సమయంలో పెంపకందారుల బంధువులు అక్కడికి చేరుకుని దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించారు. దీంతో దొంగల ముఠా వారిపై గాజు సీసాలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడికి తెగబడింది. అనంతరం పంక్చరైన వాహనాన్ని అలాగే నడుపుకుంటూ శాంతినగర్‌లోని రామచంద్రానగర్ వీధుల్లోకి తీసుకెళ్లారు. బాధితులు వారిని వెంబడించడంతో, దొంగలు ఆ పంక్చరైన వాహనాన్ని అక్కడే వదిలేసి కాలినడకన తప్పించుకున్నారు.

అక్కడి నుంచి తప్పించుకున్న దొంగల ముఠా రాయచూర్ రోడ్డు వైపునకు పారిపోయింది. అక్కడ ధర్మ అనే వ్యక్తికి చెందిన చికెన్ దుకాణం ముందు కోళ్ల లోడ్‌ను అన్‌లోడ్ చేస్తుండగా, దొంగలు ఆగి ఉన్న అతని బొలెరో వాహనాన్ని దౌర్జన్యంగా లాక్కొని పరారయ్యారు. ఈ సమాచారం అందుకున్న అలంపూర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దొంగలను కర్ణాటక సరిహద్దుల వరకు అత్యంత వేగంగా వెంబడించారు. కానీ, దొంగలు ఆ వాహనంలో ఉన్న సుమారు 250 కోళ్లను రోడ్డు పక్కన పడేసి సరిహద్దులు దాటి పారిపోయారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ దొంగలు కర్ణాటక లేదా ఎమ్మిగనూరు ప్రాంతాలకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. బొలెరో బాధితుడు, పందుల యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story