మేయర్లు, చైర్మన్లకు మార్చిలో శిక్షణ

by Muthe.Rajitha |

ఇటీవల ఎన్నికైన మేయర్లు, చైర్మన్లకు మార్చిలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

మేయర్లు, చైర్మన్లకు మార్చిలో శిక్షణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా విజయం సాధించి మేయర్, డిప్యూటీ మేయర్లు/చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికైనవారికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి సైతం స్పష్టతనిచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్న పథకాలు, కేంద్ర ప్రభుత్వ స్కీములు, విధులు, నిధుల వినియోగం గురించి అవగాహన కల్పించనున్నారు. దీంతోపాటు వారు నిర్వహించాల్సిన విధుల గురించి అవగాహన కల్పించనున్నారు. శిక్షణకు సంబంధించిన సిలబస్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్(ఎన్ఐయూఎం) ఆధ్వర్యంలో రూపొందిస్తున్నట్టు తెలిసింది.

ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లకు..

మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్లకు ఇప్పటికే దశలవారీగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి అవగాహనతోపాటు చేపట్టాలన్సిన జాగ్రత్తలు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. దీంతోపాటు గ్రామపంచాయతీ సర్పంచ్‌లకు సైతం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్లు/చైర్మెన్, వైస్ చైర్మెన్లకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడానికి మున్సిపల్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సీఎం అపాయింట్‌మెంట్ ఆధారంగా మార్చి మొదటి వారంలో నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నది. శిక్షణ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఫ్యూచర్ సిటీ సందర్శన కార్యక్రమాన్ని పెట్టే అవకాశాలు ఉన్నాయి. అక్కడ చేపట్టే కార్యక్రమాలను వివరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.

Next Story