- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాక్టర్లు, అడ్వకేట్లు, జర్నలిస్టుల జేఏసీలతో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కీలక సమావేశం
తెలంగాణ ఉద్యమకారుల సమగ్ర సంక్షేమం కోసం శాశ్వత కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలని డాక్టర్లు, అడ్వకేట్లు, జర్నలిస్టుల జేఏసీలు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీని కోరాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమకారుల సమగ్ర సంక్షేమం కోసం శాశ్వత కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలని డాక్టర్లు, అడ్వకేట్లు, జర్నలిస్టుల జేఏసీలు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీని కోరాయి. ఉద్యమకారులతో నిర్వహిస్తున్న వరుస సమావేశాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) వద్ద వైద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టుల జేఏసీలతో కమిటీ సమావేశం నిర్వహించింది. సమావేశంలో కమిటీ చైర్మన్ కే. కేశవరావు మాట్లాడుతూ తాను జార్ఖండ్ రాష్ట్రానికి మూడు సంవత్సరాల పాటు ఇన్‌చార్జిగా పనిచేశానని, అక్కడ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ విధానాలపై పూర్తి అవగాహన ఉందన్నారు.
జార్ఖండ్ కంటే మెరుగైన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి వచ్చే సూచనలు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని అర్హుల గుర్తింపు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్టులు అల్లం నారాయణ, కే. శ్రీనివాస్, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత, అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ ఎం. రాజేందర్ రెడ్డి, సీనియర్ అడ్వకేట్ ఎస్. సత్యం రెడ్డి, పలువురు జర్నలిస్టులు, ఉద్యమకారులు హాజరయ్యారు.
కమిటీకి కల్వకుంట్ల కవిత మద్దతు
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత కమిటీకి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపునకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన చారిత్రాత్మక జీవోల ప్రతులను కమిటీకి అందజేశారు. జార్ఖండ్‌తో పాటు కొత్త రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించి తెలంగాణలో కూడా ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఉద్యమకారుల సంక్షేమం కోసం శాశ్వత కార్పొరేషన్ ఏర్పాటు చేసి, కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ వంటి కీలక పదవుల్లో ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కలంతో, కెమెరాతో పోరాడిన జర్నలిస్టులకు అధికారిక గుర్తింపు, గౌరవం, సంక్షేమ పథకాలు కల్పించాలని తెలంగాణ జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్) అధ్యక్షుడు అల్లం నారాయణ కమిటీని కోరారు. సమైక్యాంధ్ర పాలనలో ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమానికి జర్నలిస్టులు సేవలందించారని గుర్తుచేశారు. ఎన్నో అవమానాలు, ఒత్తిళ్లు, ప్రభుత్వ, పోలీసుల నిర్బంధాలను ఎదుర్కొంటూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయినా ఇంకా ఆంధ్ర భావజాల మీడియా ఆధిపత్యమే కొనసాగుతోందని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే మీడియా సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో తెలంగాణ మీడియా హౌస్‌ల స్థాపనకు రూ.1,000 కోట్ల ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని టీజేఎఫ్ వినతిపత్రంలో కోరింది. అలాగే ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులను అధికారికంగా తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించి ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందించాలని విజ్ఞప్తి చేసింది. ఉద్యమ జర్నలిస్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించి కొత్త మీడియా సంస్థల్లో అవకాశాలు కల్పించాలని కూడా సిఫారసు చేయాలని కోరింది.
అడ్వకేట్లు, డాక్టర్ల కీలక డిమాండ్లు
అడ్వకేట్ జేఏసీ తరఫున న్యాయవాద వ్యవస్థ, ఉద్యమకారుల హక్కుల పరిరక్షణ కోసం శాసనమండలిలో అడ్వకేట్లకు ప్రత్యేక ఎమ్మెల్సీ స్థానం ఏర్పాటు చేయాలని కోరారు. డాక్టర్స్ జేఏసీ తరఫున డాక్టర్లకు ప్రత్యేక ఎమ్మెల్సీ స్థానం కల్పించడంతో పాటు ఉద్యమంలో పాల్గొన్న వైద్యులకు ప్రభుత్వ బదిలీల్లో ప్రత్యేక ప్రాధాన్యత పాయింట్లు ఇవ్వాలని, అధికారిక ఐడీ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్య సాధన కోసం ఆయుష్ ఆసుపత్రుల సంఖ్యను పెంచాలని కూడా కోరారు.






