ఘోర రైలు ప్రమాదం.. 14 మంది మృతి, 84 మందికి గాయాలు

by Malleboina Mahesh |

ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీకొని 14 మంది మృతి! టాక్సీ పట్టాలపై ఆగిపోవడంతో మొదలైన విషాదం. 84 మందికి తీవ్ర గాయాలు.

ఘోర రైలు ప్రమాదం.. 14 మంది మృతి, 84 మందికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న రైలు.. ప్లాట్ ఫామ్ పై ఆగి ఉన్న టాక్సీని బలంగా ఢీ కొట్టి ఆగిపోగా.. మరో రైలు వచ్చి ఢీకొట్టింది. దీంతో బోగీలు ఎగిరిపడటంతో.. మొదట నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 100 మంది వరకు గాయాలపాలు అయ్యారు. ఈ షాకింగ్ సంఘటన ఇండోనేషియా రాజధాని జాకర్తా శివారులోని బెకాసి ఈస్ట్ స్టేషన్ (Bekasi East Station) సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 14కు చేరింది. మరో 84 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఒక లెవల్ క్రాసింగ్ వద్ద ఒక టాక్సీ (Green SM Taxi) రైలు పట్టాలపై చిక్కుకుపోయింది. ఆ టాక్సీని ఢీకొన్న లోకల్ కమ్యూటర్ రైలు (Jakarta-Bekasi route) పట్టాలపై ఆగిపోయింది. పట్టాలపై ఆగి ఉన్న ఆ కమ్యూటర్ రైలును వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లాంగ్ డిస్టెన్స్ రైలు (Argo Bromo Anggrek - Jakarta to Surabaya) బలంగా ఢీకొట్టింది. లాంగ్ డిస్టెన్స్ రైలు నేరుగా కమ్యూటర్ రైలులోని చివరి బోగీని ఢీకొట్టింది. ఇది మహిళలకు కేటాయించిన భోగి కావడంతో మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం.

సహాయక చర్యలు, దర్యాప్తు..

ప్రమాదం జరిగిన వెంటనే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో (Prabowo Subianto) బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్యాస్ కట్టర్లు, భారీ యంత్రాల సాయంతో బోగీలను కట్ చేసి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీశారు. రైల్వే శాఖ, జాతీయ రవాణా భద్రతా కమిటీ ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాయి. బాధితుల వైద్య ఖర్చులు, అంత్యక్రియల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని అధికారులు ప్రకటించారు.

Next Story