- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాఠశాల తొలిరోజే విషాదం.. కరెంట్ షాక్‌తో విద్యార్థికి తీవ్ర గాయాలు
బడిబాట పట్టిన తొలిరోజే ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురైన కలచివేసే సంఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

దిశ, దేవరకొండ టౌన్: బడిబాట పట్టిన తొలిరోజే ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురైన కలచివేసే సంఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా కొండమల్లేపల్లి జడ్పీ హైస్కూల్ ఆవరణను అందంగా అలంకరించేందుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. పాఠశాల ప్రధాన గేటుకు మామిడాకుల తోరణం కట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పాఠశాల పక్కనే ఆరుబయట ఆడుకుంటున్న ఓ విద్యార్థిని ఉపాధ్యాయులు తోరణం కట్టేందుకు సహాయంగా పిలిచారు.
ఉపాధ్యాయులు పిలవడంతో ఆ విద్యార్థి తోరణం కట్టడానికి పాఠశాల ఇనుప గేట్ ఎక్కాడు. గేటు ఎక్కి తోరణం కడుతుంటే చూసుకోకుండా పక్కన ఉన్న కరెంటు తీగ తగిలింది. ఒక్కసారిగా విద్యుత్ ఘాతానికి గురికావడంతో విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ప్రమాదానికి గురైన విద్యార్థిని నాంపల్లి మండలం బండ తిమ్మాపురం గ్రామానికి చెందిన జ్యోతి, శేఖర్ దంపతుల కుమారుడు రామ్ చరణ్ (13)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే తీవ్ర ఆందోళనకు గురైన ఉపాధ్యాయులు, స్థానికులు కలిసి బాలుడిని అత్యవసర చికిత్స నిమిత్తం దేవరకొండలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పాఠశాల ప్రారంభం రోజే ఈ ప్రమాదం జరగడంతో బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






