పాఠశాలలు పునఃప్రారంభం.. పిల్లలను స్కూల్‌కు పంపని తల్లిదండ్రులు

by Jakkula.Mamatha |

వేసవి సెలవులు ముగియడంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి.

పాఠశాలలు పునఃప్రారంభం.. పిల్లలను స్కూల్‌కు పంపని తల్లిదండ్రులు
X

దిశ, ఝరాసంగం: వేసవి సెలవులు ముగియడంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే పాఠశాలల పునఃప్రారంభానికి అమావాస్య అడ్డంకిగా మారింది. ముఖ్యంగా కొత్తగా పాఠశాలలో ప్రవేశం పొందే చిన్నారులను మొదటి రోజు బడికి పంపేందుకు పలువురు తల్లిదండ్రులు ఆసక్తి చూపలేదు. కొంతమంది తల్లిదండ్రులు పాఠశాలలకు ఫోన్ చేసి, అమావాస్య కావడంతో తమ పిల్లలను మొదటి రోజు పంపించడం లేదని ముందుగానే తెలియజేయడం గమనార్హం.

దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మొదటి రోజు విద్యార్థుల హాజరు ఆశించిన స్థాయిలో కనిపించలేదు. బర్దిపూర్, కుప్పానగర్, ఝరాసంగం, ఎల్గోయి, జీర్లపల్లి, ఈదులపల్లి తదితర గ్రామాల పాఠశాలల్లో విద్యార్థుల హాజరు అంతంత మాత్రంగానే నమోదైంది. అమావాస్య కారణంగా చాలామంది తల్లిదండ్రులు పిల్లలను ఇంటి వద్దే ఉంచినట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. దీంతో పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ మొదటి రోజు సందడి ఆశించిన స్థాయిలో కనిపించలేదు. మరి కొంతమంది తల్లిదండ్రులు సోమవారం అమావాస్య కలిసి రావడంతో దేవాలయాలకు పిల్లలతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు.

Next Story