ఫామ్‌హౌస్ పార్టీలో ఘోరం.. వీకెండ్ వేడుకల్లో యువకుడి అనుమానాస్పద మృతి!

by Jakkula.Mamatha |

స్నేహితులతో కలిసి ఆనందంగా గడపాలని వెళ్లిన ఓ యువకుడు తిరిగి ఇంటి ముఖం చూడకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో చోటుచేసుకుంది.

ఫామ్‌హౌస్ పార్టీలో ఘోరం.. వీకెండ్ వేడుకల్లో యువకుడి అనుమానాస్పద మృతి!
X

దిశ, చౌటుప్పల్ టౌన్: స్నేహితులతో కలిసి ఆనందంగా గడపాలని వెళ్లిన ఓ యువకుడు తిరిగి ఇంటి ముఖం చూడకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో చోటుచేసుకుంది. కొయ్యలగూడెం పరిధిలోని ఓ ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి నిర్వహించిన వీకెండ్ పార్టీ విషాదాంతమైంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న మంచిర్యాల జిల్లాకు చెందిన గండ్ల రాము అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. హైదరాబాద్‌లోని ఎన్‌సీఎల్ కంపెనీకి చెందిన సుమారు 15 మంది ఉద్యోగులు వీకెండ్ సందర్భంగా కొయ్యలగూడెం సమీపంలోని ఫామ్‌హౌస్‌కు వచ్చి పార్టీ నిర్వహించారు.

రాత్రంతా సరదాగా గడిపిన అనంతరం ఆదివారం ఉదయం రాము అనుమానాస్పద స్థితిలో కనిపించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలిసింది. దీంతో అక్కడున్న వారిలో ఒక్కసారిగా కలకలం రేగింది. మృతుడి శరీరంపై గాయాల ఆనవాళ్లు కనిపిస్తున్నట్లు సమాచారం. దీంతో పార్టీ సందర్భంగా ఏదైనా గొడవ జరిగిందా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిమిత్తం భద్రపరిచారు. రాము మృతి వెనుక అసలు కారణాలు ఏమిటన్న దానిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

పార్టీకి హాజరైన వారిని విచారిస్తూ, ఘటనకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, రాము మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్న కుమారుడు ఇక లేడనే వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. స్నేహితులతో ఆనందంగా గడపడానికి వెళ్లిన యువకుడు శవంగా ఇంటికి చేరుతుండటంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story